తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు కొత్త బూస్టింగ్‌

ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త పార్టీ మ‌నుగ‌డ సాధించ‌డమంటే క‌త్తి మీద‌సాములాంటిదే! ముఖ్యంగా తెలంగాణ వాదం బ‌లంగా వినిపిస్తున్న తెలంగాణ‌లో..అస్స‌లు ఊహించ‌డ‌మే క‌ష్టం! కానీ జ‌న‌సేనాని దానిని సుసాధ్యం చేస్తున్నాడు. ఆ ఊహ‌ల‌న్నీ ప‌టాపంచెలు చేసేందుకు స‌రికొత్త వ్యూహంతో ముందుకు వ‌స్తున్నాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేత‌లు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విఫ‌ల‌మైన విష‌యంలో.. ప‌వ‌న్ విజ‌యం సాధించిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్‌ను జ‌న‌సేన త‌ర‌ఫున రంగంలోకి దించ‌బోతున్నాడ‌ట‌. అలాగే తెలంగాణ‌కు సంబంధించిన కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌బోతున్నాడనే టాక్ న‌డుస్తోంది.

రెండు రాష్ట్రాల్లోనూ అస్థిత్వం కోసం జ‌న‌సేనాని వ్యూహాలు ర‌చిస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌నుండ‌టంతో అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నాడు. ఏపీలో రాజ‌కీయంగా కొంత క‌లిసివ‌చ్చినా.. తెలంగాణ‌లో జ‌న‌సేన‌కు క్యాడ‌ర్ మాత్రం లేదు. దీంతో ఈవిష‌యంపై ఫోక‌స్ పెట్టాడు. జనసేనకు నమ్మకస్తులైన కార్యకర్తలను తయారు చేయడంతో పాటు నాయకులతోనూ రాయబారాలు నడుపుతున్నాడు. ప్ర‌స్తుతం ఉద్య‌మ‌కారుడు గ‌ద్ద‌ర్‌తో జరిపిన చ‌ర్య‌లు స‌ఫ‌ల‌మైనట్టే క‌నిపిస్తున్నాయి.

2014 ఎన్నికలకు ముందే గద్దర్‌ని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. అలాగే గద్దర్ సపోర్ట్ కోసం కేసీఆర్ కూడా ప్రయత్నం చేశారు. కానీ గద్దర్ మాత్రం ఉద్యమ బాట వదిలి రాజకీయ అరంగేట్రం చేయడానికి ఇష్టపడలేదు. కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్‌కి సాధ్యం కానిదాన్ని పవన్ సాధించినట్టుగా కనిపిస్తోంది. గద్దర్ మాటలు చూస్తూ ఉంటే జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన పార్టీపై ప్ర‌శంస‌లు కురిపించారు గద్దర్.  పవన్ కల్యాణ్ సీమాంధ్రకు పరిమితం అవడం ఖాయం. ఇక తెలంగాణ జ‌న‌సేన విభాగానికి గద్దర్‌లాంటి నేత నాయకత్వం వహిస్తే పార్టీ అస్థిత్వానికి మాత్రం ఢోకా ఉండదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు సానుభూతిపరులు, గద్దర్ అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. అన్నింటికీ మించి అవ‌కాశవాద రాజ‌కీయ నాయ‌కులు కాక గద్దర్ లాంటి నాయకుడు పార్టీలో చేరితే సిద్ధాంతపరంగా పార్టీకి బలమే అవుతుందని ప‌వ‌న్ భావిస్తున్నార‌ట‌. సినిమావాళ్ల‌ను ఆదరించే అలవాటు సీమాంధ్రలో ఉన్నంతగా తెలంగాణాలో లేదు. గద్దర్ చేరికతో సినిమా వాళ్ల‌ పార్టీ అన్న ముద్ర కూడా చాలా వరకూ చెరిగిపోయే అవకాశం ఉంది. మ‌రి తెలంగాణ‌లో వీరి దోస్తీ ఎంత మేర‌కు విజ‌యం సాధిస్తుందో వేచిచూడాల్సిందే!!