అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వారం రోజుల ల‌గ్జ‌రీ ఖ‌ర్చెంతో తెలుసా

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఉత్కంఠ ప‌రిణామాల‌తో ఎట్ట‌కేల‌కు స‌మ‌సిపోయింది. జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కాల‌న్న ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఇక ఇప్పుడు సీఎం పీఠం రేసులో అమ్మ న‌మ్మిన‌బంటు ప‌న్నీరుసెల్వం వ‌ర్సెస్ చిన్న‌మ్మ న‌మ్మిన‌బంటు ప‌ళ‌నిస్వామి మాత్ర‌మే ఉన్నారు. శ‌శిక‌ళ‌కు అక్ర‌మాస్తుల కేసులో నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో రేపోమాపో ఆమెను పోలీసులు అరెస్టు చేయ‌డం ఖాయం.

ఇక ఇప్పుడు శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఎమ్మెల్యేల్లో భ‌యం ప‌ట్టుకుంది. ప‌ళ‌నిస్వామికి మ‌ద్ద‌తు ఇస్తే ఒక టెన్ష‌న్‌…ఇవ్వ‌క‌పోతే మ‌రో టెన్ష‌న్ అన్న‌ట్టుగా వీరి ప‌రిస్థితి ఉంది. ఇదిలా ఉంటే వారం రోజుల పాటు శ‌శిక‌ళ ఏర్పాటు చేసిన సీక్రెట్ శిబిరానికి ఖ‌ర్చు త‌డిసి మోపెడైన‌ట్టు తెలుస్తోంది.

త‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన ఎమ్మెల్యేల‌ను శ‌శిక‌ళ గోల్డెన్ బే రిసార్ట్‌లో వారం రోజుల పాటు ఉంచారు. ఇందుకోసం అయిన భార బిల్లు మొత్తం ఇప్పుడు ఎవ‌రు క‌డ‌తార‌న్న‌దే పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఎమ్మెల్యేలు బ‌స‌చేసిన రిసార్ట్ అత్యాధునిక హంగుల‌తో ఉంటుంది. ఇక్క‌డ ఉన్న 60 విలాస‌వంత‌మైన గ‌దుల‌కు భారీగా అద్దె చెల్లించాల్సి ఉంది. ట్రాంక్విల్ రూమ్స్‌కు రోజుకు 5,500 రూపాయలు, బే వ్యూ రూమ్స్‌కు రోజుకు 6,600 రూపాయలు. ప్యారడైస్ సూట్ రూమ్స్‌కు రోజుకు 9,900 రూపాయల అద్దె. అయితే ఒక్కో రూమ్‌కు రోజుకు 7వేలు అద్దె చెల్లిస్తామని శశికళ రిసార్ట్ యాజమాన్యంతో ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ లెక్క‌న ఆరు రోజుల‌కు కేవ‌లం అద్దె మాత్ర‌మే రూ.25 ల‌క్ష‌లు అయ్యింది. ఇక ఎమ్మెల్యేలు దొరికిందే ఛాన్స్ అంటూ ఎక్క‌డా లేని రాజ‌భోగాల‌తో ఎంజాయ్ చేశార‌ట‌. ఖ‌రీదైన మ‌ద్యం, యువ‌తుల‌తో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా ఎంజాయ్ చేశార‌ట‌. దీంతో ఈ ఖ‌ర్చంతా మ‌రో రూ.25 ల‌క్ష‌లు అయ్యింద‌ట‌.

ఒక్కో ఎమ్మెల్యే రోజుకు స్నాక్స్ కోస‌మే రూ.2 వేలు లాగేశార‌ట‌. బుధ‌వారం స‌మావేశం నుంచి ఎమ్మెల్యేలు డైరెక్టుగా ఇటు వ‌చ్చేశారు. వాళ్లు ఇంటికెళ్లి దుస్తులు తెచ్చుకునే టైం కూడా ఇవ్వలేదు. దీంతో ఒక్కో ఎమ్మెల్యేకు దుస్తుల‌కే రోజుకు రూ.1000 ఖ‌ర్చు చేశార‌ట‌. ఈ బిల్లే అద్దె కాకుండా మ‌రో రూ.12 ల‌క్ష‌లు అయ్యింద‌ట‌. ఇత‌ర‌త్రా మొత్తం ఖ‌ర్చుల‌న్ని క‌లిపి రూ.కోటి వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యింద‌ట‌. శ‌శిక‌ళ మీద న‌మ్మ‌కంతో రిసార్ట్స్ యాజ‌మాన్యం కూడా ఎమ్మెల్యేలు అడిగిన‌వ‌న్నీ ఇచ్చారు. ఇప్పుడు ఆమె జైలుకు వెళ్లే ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో ఈ బిల్లు ఎవ‌రు క‌డ‌తారు ? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.