ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ

February 10, 2017 at 9:31 am
11

సినిమా : ఓం నమో వేంకటేశాయ
రేటింగ్ : 2.75/5
పంచ్ లైన్ : భక్తి ..విరక్తి కాంబో ప్యాక్

నటీనటులు : అక్కినేని నాగార్జున, సౌరబ్‌జైన్‌, అనుష్క, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు..
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి
కథ, మాటలు: జె.కె.భారవి
నిర్మాత: మహేశ్‌రెడ్డి
దర్శకత్వం: రాఘవేంద్రరావు

భక్తి,రక్తి,ముక్తి మూడింటిని అటు విడి విడిగాను ఇటు కలబోత గానూ ఇప్పటికే దాదాపు టచ్ చేసేసాడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.అయితే మనకు పెద్దగా పరిచయం లేని ఓ వేంకటేశ్వరుని భక్తుడైన హాది రామ్ బాబా కథతో కాస్త ఆసక్తిని రేకెత్తించడం లో సఫలమైనా అదే రేంజ్ లో సినిమాని ప్రమోట్ చెయ్యటం లోను,ప్రేక్షకుల్ని తొలి రోజు సినిమాకి రప్పించడం లోను సక్సెస్ కాలేకపోయారు. భక్తి సినిమాలకి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన దర్శకేంద్రుడే తన మార్క్ కి దరి దాపుల్లోకి కూడా చేరుకోలేకపోయారు ఈ నమో వెంకటేశాయ సినిమాలో.

అన్నమయ్య అనూహ్య,అఖండ విజయం వెనుక అనేక కారణాలున్నాయి,అప్పుడు నాగార్జున భక్తి రస పాత్ర పోషించడం ఒక సెన్సేషన్,ఇక అన్నమయ్య పాటలు,ఆ స్క్రిప్ట్ అలా కుదిరాయి ఆ విజయానికి,ఇక ఆ తరువాత శ్రీ రామ దాసు అవేరేజ్ హిట్ చేసిన ప్రేక్షకులకి, షిర్డీ సాయి పంటికింద రాయిలా మిగిలిపోయింది.ఇలా ఒక దాని తరువాత ఒకటి ఒకే జోనర్ సినిమాలు గ్రాఫ్ అలా పడుతూ పాతాళానికి చేరినా దర్శకేంద్రుడుకి కనువిప్పు కలగలేదేమో మరోసారి అదే ఫ్లేవర్ ని టచ్ చేసాడు.చేయకూడదు అని కాదు కానీ దానికి కావాల్సిన ఫ్రెష్ నెస్ స్క్రిప్ట్ లో ఉందా స్క్రీన్ ప్లే సినిమాటిక్ గా ఉందా లేదా అని చేసుకోకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలయత్నాలుగానే మిగులుతాయి.

అన్నమయ్య, శ్రీ రామ దాసు కథలు మనందరికీ తెలిసినవే.అయినప్పటికీ తెరపైన భగవంతునికి భక్తునికి మధ్య జరిగే భక్తి రస కావ్యం లో ఓ ఉత్కంఠ కనిపిస్తుంది.సినిమా ఆద్యంతం అదే భావనతో ప్రేక్షకుడిని లీనం చేస్తాయి ఆ సినిమాలు.చివరగా సినిమా ఆఖరి ఘట్టం లో భగవంతుడు ప్రత్యక్షమై కథకు ముగింపు పలకడం ప్రేక్షకులు మెచ్చిన సినిమాటిక్ స్క్రిప్ట్.భగవత్ దర్శనం కోసమే అన్నమయ్య అయినా శ్రీ రామదాసయినా చివరి వరకు పరితపిస్తారు.ఆ కతాంశాలకు సినిమాటిక్ ఆరంభం,అంతం అతికినట్టు సరిపోవడం కలిసొచ్చింది.

నమో వెంకటేశాయ విషయానికి వస్తే భక్తునికి భగవత్ దర్శనం ప్రథమార్థం లోనే దొరికేయడం,భక్తుని కష్టాలన్నీ భగవంతుడు చిటికెలో తీర్చేస్తుండడం అనే స్క్రీన్ ప్లే నే ఈ సినిమాకి పెద్ద అడ్డంకి గా మారింది.తెలిసిన కథలో వుండే ఉత్కంఠ కూడా ఈ తెలియని కథలో మైంటైన్ చేయకపోవడం లోటు.భక్తునికి అలా కష్టమొచ్చిందో లేదో ఇలా భగవంతుడు ప్రత్యక్షమై పారదోలేయడంతో సినిమా ఆద్యంతం పేలవంగా సాగుతుంది.

రామ అనే బాలుడు భగవద్దర్శనం కోసం ఆశ్రమం లో చేరి కఠోర తపస్సు చేస్తుండగా ప్రత్యక్షమైన బాల భగవంతుడిని గుర్తించలేక వెనుదిరిగి సంసార సాగరంలో మునగబోతుండగా మళ్ళీ తన కోరికను చంపుకోలేక తిరుమల క్షేత్రాన్ని వచ్చి కృష్ణమ్మ తో కలిసి భగవంతుడి దర్శన మార్గాన్ని కనుగొని క్షేత్రాన్ని ప్రక్షాళన చేసి,భగవంతుడి దర్శనం పొంది భగవంతుడి తోనే పాచికలాడి,ఓడించి మెప్పించే భక్తుడు రామ్ హాది రామ్ ఎందుకయ్యాడు అతని కథ ఎలా ముగిసిందన్నదే కతఅంశం.

నాగార్జునకు ఇలాంటి పాత్త్ర అన్నమయ్యలో కష్టమనిపించిందేమో కానీ ఆ తరువాత అన్ని కేక్ వాక్ అనే చెప్పాలి.తన పాత్రకి చేయగలిగినంత ఇవ్వగలిగినంత దానికంటే ఎక్కువే న్యాయం చేసాడు నాగ్.హీరోయిన్స్ ప్రజ్ఞా రాఘవేంద్ర రావు మార్క్ పాటకోసం అన్నట్టు వుంది సినిమాలో.ఇక అనుష్క పాత్ర ఆది అంతం లేదన్నట్టుగా వుంది.అనుష్క వుంది కాబట్టి రొమాంటిక్ సాంగ్ లేకుంటే బాగోదు అన్నట్టు జగపతి బాబు తో ఓ పాటను పెట్టి వేధించారు జనాల్ని.మిగిలిన వాళ్లలో వెంకటేశ్వరునిగా సౌరభ్ జైన్ సరదా సన్నివేశాల్లో మెప్పించినా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ లో తేలిపోయాడు. స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వున్నా అదే రేంజ్ లో హావభావాలు పలకలేదు.రావు రమేష్,రాఘుబాబు,వెన్నెల కిశోరె తదితరులంతా పర్లేదనిపించారు.

ఇలాంటి కథలకి రెండు గంటలకి పైగా తెర ముందు ప్రేక్షకుల్ని కూర్చేబెట్టే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ కావాలి.స్క్రీన్ ప్లే గ్రిప్పింగా ఉండాలి.ఈ రెండూ ఈ సినిమాలో మిస్ అయ్యాయి.కావాల్సినంత భక్తి రసం అయితే సినిమాలో వుంది కానీ దాన్ని సినిమాటిక్ గా ప్రెజెంట్ చేయడం లో మాత్రం దర్శకేంద్రుడు విఫలమయ్యాడు.ఇటువంటి సినిమాకి పాటలే సగం సక్సెస్ ఇచ్చాయి గతంలో.అది ఈ సినిమాలో మిస్ అయ్యింది.కెమెరా వర్క్ ,ఆర్ట్ వర్క్ సినిమాకి అతి పెద్ద అసెట్స్ అని చెప్పాలి.అవి రెండే సినిమాని ఆమాత్రం అయినా తెరపై నిలబెట్టాయి.ఎడిటింగ్ ఇంకా క్రిస్పీ గా ఉంటే బాగుండేది.డైలాగ్స్ పెద్ద ఇంపాక్టింగ్ గా లేవు.భగవంతుడిని చూడ్డానికి చదువు అక్కర్లేదు కానీ భగవంతుడు కనిపిస్తే అతనే భగవంతుడు అని తెలుసుకోవడానికి చదువు కావలి లాంటి ఒకటి రెండు డైలాగ్స్ బాగున్నాయి.

మొత్తంగా భక్తి రస చిత్రాలకి కాలం చెల్లిందని చెప్పలేము కానీ ఇప్పటి తరానికి, ఇప్పటికే చూసేసిన చిత్రాలకి భిన్నంగా,స్క్రీన్ ప్లే రాసుకుని ప్రెజెంట్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందేమో కానీ ఎంత భక్తిని సినిమాలో చొప్పించినా సినిమాటిక్ గా ప్రెజెంట్ చేయలేకపోతే మాత్రం చేతులు కాల్చుకోక తప్పదు.

ఓం నమో వెంకటేశాయ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share