లైట్ తీసుకోమంటున్న అఖిల ప్రియ..టెన్షన్ లో టీడీపీ నాయకులు

నంద్యాల‌లో టీడీపీ గెల‌వ‌క‌పోతే…ఆ త‌ర్వాత టీడీపీ ప‌రువు ఎలా గంగ‌లో క‌లిసిపోతుందో ? వాళ్ల మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటారో ? వైసీపీ వాళ్ల ఆనందం ఎలా ఉంటుందో ? ఊహించుకోవ‌డానికి ఊహ‌కే అందడం లేదు. ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని గెలిపించుకోవ‌డానికి చంద్ర‌బాబు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో ? ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నారో ? ప‌్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక్క‌డ రిజ‌ల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా చంద్ర‌బాబు కెరీర్‌కే అది పెద్ద మ‌చ్చ‌గా మిగిలిపోతుంది. 2019లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అంశంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చంద్ర‌బాబు ఇక్క‌డ ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు, 6 గురు మంత్రుల‌ను రంగంలోకి దించారంటే ఆయ‌న ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నారంటే అర్థ‌మ‌వుతోంది. ఇక్క‌డ జిల్లా టీడీపీ శ్రేణుల‌న్ని మోహ‌రించి బ్ర‌హ్మానంద‌రెడ్డి గెలుపుకోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతుంటే దివంగ‌త భూమా నాగిరెడ్డి కుమార్తె, మంత్రి భూమా అఖిల‌ప్రియ మాత్రం చాలా లైట్ తీస్కొంటున్న‌ట్టు చంద్ర‌బాబుకు ప‌దే ప‌దే నివేదిక‌లు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

అఖిల‌ప్రియకు రాజ‌కీయానుభ‌వం లేక‌పోవ‌డంతో పాటు ఆమె ఎన్నిసార్లు చెప్పినా టీడీపీ శ్రేణుల‌ను క‌లుపుకుని వెళ్ల‌క‌పోవ‌డం, భూమా గ‌తంలో ఎంతో ప్ర‌యారిటీ ఇచ్చిన సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం లాంటి అంశాలు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తున్నాయని టీడీపీ శ్రేణులు బాబుకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక ఒక‌రిద్ద‌రితో కోటరీ ఏర్పాటు చేసుకుని వాళ్లు చెప్పిన‌ట్టు న‌డుచుకోవ‌డం, ఆమె చేస్తోన్న ప‌నులు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తుండ‌డంతో నంద్యాల‌లో టీడీపీ శ్రేణులు అఖిల‌పై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నాయి.

ఇక దివంగ‌త భూమా రైట్ హ్యాండ్ ఏవీ.సుబ్బారెడ్డిని అఖిల ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న తీవ్ర అసంతృప్తితో పార్టీ మారే వ‌ర‌కు వ్య‌వ‌హారం వెళ్లింది. చివ‌ర‌కు ఈ ఇష్యూలో చంద్ర‌బాబు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే అఖిల‌ప్రియ తీరుతో విసిగిపోయిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను ప‌క్క‌న పెట్టేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు టీడీపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం.

2019 ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ టిక్కెట్టు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి, నంద్యాల టిక్కెట్టు భూమాకు అత్యంత స‌న్నిహితుడు అయిన ఏవీ.సుబ్బారెడ్డి ఇవ్వాల‌ని బాబు ప్రాథ‌మికంగా డెసిష‌న్ తీసుకున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. అదే జ‌రిగితే భూమా అఖిల‌ప్రియ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు 2019లోనే శుభం కార్డు ప‌డిన‌ట్ల‌వుతుంది. అనుభ‌వ లేమి, సీనియ‌ర్లు చెప్పిన‌ట్టు విన‌క‌పోవ‌డంతోనే ఆమెకు ఈ ప‌రిస్థితి వ‌చ్చింది.