పన్నీర్ సీఎం అయితే బీజేపీదే అధికారమా?

February 10, 2017 at 10:24 am
77

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆధిప‌త్యం కోసం ప‌రిత‌పిస్తున్న బీజేపీకి త‌మిళ‌నాడు ద్వారా ఆ అవ‌కాశం దక్కిందా?  ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెలకొన్న సంక్షోభంలో జోక్యం చేసుకోబోమ‌ని కేంద్రం పైకి చెబుతున్నా.. రిమోట్ కంట్రోల్ మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచుకోబోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర రావు ద్వారా పావులు న‌డిపిస్తోంది కేంద్ర నాయక‌త్వం! అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు ఇచ్చి తెర వెనుక చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి హ‌స్తిన ఆధిప‌త్యాన్నిత‌మిళులు ఏవిధంగా స‌హిస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌మిళ‌నాట నెల‌కొన్న సంక్షోభ రాజ‌కీయాలు.. రాజ్‌భ‌వ‌న్‌కు చేరాయి! తీవ్ర ఉత్కంఠ న‌డుమ అటు శ‌శిక‌ళ వ‌ర్గం, ఇటు ప‌న్నీర్ వ‌ర్గం గవ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుతో భేటీ అయింది. వారి వాద‌న‌న‌ను వినిపించింది, అయితే ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ ఏం చేయ‌బోతున్నారు? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది, శ‌శిక‌ళ‌తో సీఎంగా ప్ర‌మాణం చేయిస్తారా?  లేక అక్ర‌మాస్తుల కేసులో తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ వేచిచూస్తారా? ఇక ప‌న్నీర్‌కు శాస‌న‌స‌భ‌లో బ‌లం నిరూపించుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తారా? ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోర్టులో బంతి ఉంది క‌నుక ఆయ‌న ఏ నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం వ్య‌హారాల‌పై మోడీ క‌న్నేసి ఉంచార‌నే క‌థ‌నాలూ వినిపిస్తున్నాయి.

ఏదేమైనా త‌మిళ‌నాడు వ్య‌వ‌హారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప‌న్నీర్‌కు నాలుగు రోజులు స‌మ‌యం ఇవ్వ‌డం వెన‌క భాజ‌పా వ్యూహాత్మ‌కంగానే ఉంద‌ని అనిపిస్తోంది. అంటే, శ‌శిక‌ళ వ‌ర్గం నుంచి అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తుదారుల‌ను కూడ‌గ‌ట్టుకునే స‌మ‌యం ప‌న్నీర్‌కు ఇచ్చారా? అనే అనుమానం క‌లుగ‌క మాన‌దు! ఈ నాలుగైదు రోజుల్లో సుప్రీం కోర్టు నుంచి ఏదైనా తీర్పు వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టున్నారు! అప్పుడు ప‌రిస్థితి శశిక‌ళ‌కు ప్ర‌తికూలంగా మారితే కాగ‌ల కార్యం గంధ‌ర్వులు నెర‌వేర్చిన‌ట్టు అవుతుందని వేచి చూస్తున్నారా అనే ధోర‌ణి కూడా క‌నిపిస్తోంది.

నిజానికి, అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణించిన వెంట‌నే త‌మిళ‌నాడును త‌మ కంట్రోల్‌కి తెచ్చుకునేందుకు భాజ‌పా ప్ర‌య‌త్నించింది. వెంక‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడైన తంబీ దురైని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాల‌ని భాజ‌పా బాగానే పావులు క‌దిపింది. కానీ, ఆ త‌రుణంలో శ‌శిక‌ళ అలెర్ట్ కావ‌డంతో భాజ‌పా ఎత్తు పార‌లేదు. భాజ‌పాకి త‌మిళ‌నాడుపై ప‌ట్టు కావాలి. అమ్మ ఉండ‌గా అది సాధ్య‌ప‌డ‌లేదు. ఇప్పుడు చిన్న‌మ్మ‌ను సైడ్ చేసే అవ‌కాశం దొరికింది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌న్నీర్‌ను సీఎం చేస్తే,, ఇక వెనక ఉండి అన్నీ న‌డిపించ‌వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది!

పన్నీర్ సీఎం అయితే బీజేపీదే అధికారమా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share