ప‌న్నీర్ వ‌ర్గంపై వేటుకు శ‌శిక‌ళ వ్యూహం

త‌మిళ రాజ‌కీయాలు అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ, జ‌య న‌మ్మిన‌బంటు, ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వానికి మ‌ధ్య పోరు తీవ్ర‌మవుతోంది. రోజులు గ‌డిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు పెరుగుతుండ‌టంతో శ‌శి శిబిరంలో అల‌జ‌డి రేగింది. అయితే ప‌న్నీర్ వ‌ర్గానికి అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ‌కు అవ‌కాశం ఇస్తే ఏమిట‌న్న విష‌యంపై శ‌శిక‌ళ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఒక‌వేళ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేలు.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శ‌శిక‌ళ‌ సిద్ధ‌మ‌వుతున్నారు.

త‌న‌కు అధికారం ద‌క్క‌కుండా జ‌రుగుతున్న ప‌రిణామాల‌న్నింటినీ జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ప‌న్నీర్ సెల్వానికి ఆద‌ర‌ణ పెరుగుతున్న కొద్దీ.. శ‌శి శిబిరంలో క‌ల‌క‌లం రేగుతోంది. త‌న‌ కోర్టులో బంతి ఉన్నా.. ఇప్ప‌టికి ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డంపై శ‌శిక‌ళ.. గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాయడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికే త‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న నేప‌థ్యంలో.. పన్నీర్‌సెల్వంకు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ సమాయత్తమవుతున్నారు.

తొలుత పార్టీపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం నిర్వర్తిస్తున్న పార్టీ కోశాధికారి పదవి నుంచి శశికళ తొలగించారు. ఆ తర్వాత పన్నీర్‌కు మద్దతునిచ్చిన పార్టీ ప్రిసీడియం చైర్మన మధుసూదనను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక పన్నీర్‌ వర్గంలో చేరిన పార్లమెంట్‌ సభ్యులను కూడా పార్టీ నుంచి తొలగిస్తున్న ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే పన్నీర్‌సెల్వంను గానీ, ఆయనకు మద్దతునిస్తున్న శాసనసభ్యులను గానీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించకపోవడం గమనార్హం. శాసనసభ్యులను ఇప్పటికిప్పుడు పార్టీ నుంచి బహిష్కరించకుండా శాసనసభలో జరిగే బలపరీక్షలో వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి చర్య తీసుకోనున్నార‌ట‌.

ఇప్పటికిప్పుడు వీరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే త‌న‌పై ఇంకా వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని శ‌శిక‌ళ భావిస్తున్నార‌ట‌. ఒక వేళ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర రావు శాసనసభలో బలపరీక్షకు ఆదేశాలిస్తే అదే అదనుగా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, ఆయనకు మద్దతునిచ్చే శాసనసభ్యులను పార్టీ విప్‌ ఆదేశాలు జారీ చేసి వారిని అనర్హులుగా చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై పన్నీర్‌సెల్వం న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నార‌ట‌.ఒకే పార్టీలో ఇరువర్గాలు రెండు రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో అనర్హత వేటు పడే అవకాశం లేదని న్యాయనిపుణులు పన్నీర్‌సెల్వంకు స్పష్టం చేశారని తెలుస్తోంది. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో వేచిచూడాల్సిందే!