నాడు వై ఎస్ చేసిన తప్పునే .. నేడు బాబు చేస్తున్నాడా ?

ఏపీలో అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుమ‌ల‌. ఇక్క‌డ‌కు నిత్యం ల‌క్ష‌ల సంఖ్య‌లో భ‌క్తులు  వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శిస్తారు. అన్య మ‌త‌స్తుల‌కు, అన్య మ‌త ప్ర‌చారాల‌కు ఈ ఆల‌యం ఎట్టి ప‌రిస్థితిలోనూ అవ‌కాశం ఇవ్వ‌దు. ఇక‌, అన్య మ‌త‌స్తులు ఆల‌యంలోకి ప్ర‌వేశించాలంటే.. తాము హిందూ ధ‌ర్మాన్ని న‌మ్ముతున్నామ‌ని, హిందూ ఆచారాల ప‌ట్ల విశ్వాసం ఉందని డిక్ల‌రేష‌న్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. టీటీడీ చైర్మ‌న్‌గా మైద‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు ఇస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగానే. 

సుధాకర్‌ యాదవ్‌కు ఆ పదవి ఇవ్వవద్దంటూ కొన్ని హిందూ ధార్మిక సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆయ‌న‌కు హిందూ మతంపై విశ్వాసం లేదని, అటువంటి వ్యక్తికి పవిత్రమైన ఈ పదవి ఎలా ఇస్తారని హిందూ సంస్థలతో పాటు, అధికార టీడీపీ నేత‌లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి పుట్టా హిందూ మత వ్యతిరేకని, ఆయన కొన్ని క్రిస్టియన్‌ మత సంస్థలు నిర్వహించే ప్రచార సభలకు వెళతారని, పైగా ఆ సభలకు అధ్యక్షత వహిస్తారని వారు అంటున్నారు. క్రిష్టియన్‌ సువార్త సభలకు వెళ్లి ఆ మతంపై విశ్వాసం ప్రకటించే పుట్టాకు టీటీడీ ఛైర్మన్‌ పదవి ఇవ్వడం సరికాదని ర‌గ‌డ‌కు దిగుతున్నారు. 

ఈ క్ర‌మంలో ఇప్పుడు పుట్టా నియామ‌కంపై అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. బీసీలకు ఇవ్వాలనుకుంటే వేరే వ్యక్తులకు ఇవ్వవచ్చని, వివాదాస్పద వ్యక్తులకు పదవులు ఇచ్చి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఎంపీలు(రాయ‌పాటి, ముర‌ళీమోహ‌న్‌) ఆ పదవి కోసం పోటీ పడితే.. వారికి ఇవ్వడం ఇష్టం లేకే..బీసీ పేరును తెరపైకి తెచ్చారని కొంద‌రు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఇక‌, ఇప్పుడు గ‌త టీటీడీ చైర్మ‌న్ల ప‌ద‌వుల‌ను గ‌తంలోనూ ఇత‌ర మ‌త‌స్తుల‌కు క‌ట్ట‌బెట్టార‌నే క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. 

వై.ఎస్ సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరుకు చెందిన భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్నారు.  హిందూమత ద్వేషి, నాస్తికుడు అయిన భూమ‌న కు చైర్మ‌న్ ఇవ్వ‌డం అప్ప‌ట్లోనూ వివాదం చ‌ల‌రేగింది. అయితే వీటన్నిటిని వైఎస్ అంత‌గా ప‌ట్టించుకోలేదు. అయితే పదవిలోకి వచ్చిన తరువాత కరుణాకర్‌రెడ్డి తనకు దేవునిపై విశ్వాసం ఉందని ప్రకటించారు. నాస్తికుడ్ని కాదని, రాడికల్‌ మూమెంట్‌లో ఉన్న సందర్భంలో ఆ విధంగా వ్యవహరించానని, దీనికి చింతిస్తున్నానని ప్రకటించారు. ఇప్పుడు సుధాకర్‌యాదవ్ కూడా అదే విధంగా చింతిస్తున్నానని ప్రకటిస్తే సరిపోతుందేమోనని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.