పవన్ క్లారిటీ : ఎంపీసీట్లు ఫోకస్ వద్దు..!

March 14, 2019 at 12:16 pm

మొత్తానికి పవన్ కల్యాణ్ కు, జనసేన పార్టీ కీలక నాయకులకు తమకు ఉండగల అసలైన బలాబలాల గురించి క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. పార్టీలో అత్యంత కీలక వ్యక్తులుగా, పార్లమెంటులో అడుగుపెట్టగల స్థాయివారిగా ముద్ర పడి ఉన్న నాయకులు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే బరికే పరిమితం అవుతున్నారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ తురుపుముక్కలు అనుకునే వారిని, తనకు అత్యంత ముఖ్యమైన వారిని కేవలం శాసనసభ బరికే పరిమితం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రధానంగా.. జనసేన పార్టీ కీలక నాయకుల్లో ఒకరైన తోట చంద్రశేఖర్ ను గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ ప్రకటించారు. ఇది అనూహ్య పరిణామంగా పార్టీలోనే చర్చ జరుగుతోంది. తోట చంద్రశేఖర్… ఇతర రాష్ట్రాలలో కూడా సేవలందించిన సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిగా గుర్తింపు ఉన్నవారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం తరఫున, తర్వాత వైసీపీ తరఫున కూడా ఎంపీగా పోటీచేసిన అనుభవం ఉంది.

జనసేనలో చేరిన తర్వాత పార్టీకోసం 99 టీవీ న్యూస్ ఛానెల్ ను కూడా కొన్నారు. లాభాలు లేకున్నా వ్యయప్రయాసలు భరిస్తూ జనసేన పార్టీ ఎన్నికల అవకాశాల కోసం దానిని నిర్వహిస్తున్నారు. ఆయన ఈసారి కూడా ఎంపీగా బరిలోకి దిగి.. పార్లమెంటుకు వెళ్తారని బహుళ ప్రచారం జరిగింది. కానీ… పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసిన తొలిజాబితాలో… ఆయన ఎమ్మెల్యే స్థానానికి మాత్రమే పరిమితం అయ్యారు.

పవన్ కల్యాణ్ తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి.. గమనిస్తే.. ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లను ఎంచుకోవడం మేలని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎంపీ గా పోటీలో దిగితే.. పరిస్థితి గ్యారంటీ లేదని.. ఎమ్మెల్యేగా అయితే.. కాస్త కష్టపడితే ఫలితం దక్కుతుందని.. ఆ పార్టీ కీలక నాయకులే భావిస్తున్నారా అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. పైగా జనసేన ఏ కొద్ది సీట్లు గెలుచుకోగలిగినా.. తెదేపా, వైకాపాల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. సంకీర్ణంలో కీలకంగా ఉండి మంత్రి పదవులు పొందవచ్చునని కూడా వారు ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.

పవన్ క్లారిటీ : ఎంపీసీట్లు ఫోకస్ వద్దు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsShare
Share