2019లో పోటీపై ప‌వ‌న్ డైలమా… జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది..!

November 20, 2017 at 4:19 pm
pawan-TJ

ప్ర‌ధాన పార్టీల‌తో పాటు జ‌న‌సేన కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. జ‌న‌సేనాని కూడా ఇక‌పై రాజ‌కీయాల‌పైనే పూర్తిగా దృష్టిపెడుతున్నాడు. వీలైనంత త్వ‌ర‌గా సినిమాలు పూర్తి చేసి.. పార్టీ నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌వ‌న్ వ్యూహాలు ఇలా ఉంటే.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లోనే గాక‌, పవ‌న్ అభిమానుల్లోనూ, స‌గ‌టు ప్ర‌జ‌లను ఎన్నో ప్ర‌శ్న‌లు వేధిస్తున్నాయి. జ‌న‌సేనాని ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటాడు?  సింగిల్‌గానే బ‌రిలోకి దిగుతాడా?  లేక ఏదైనా పార్టీతో జ‌త క‌లుస్తాడా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్‌కు ఇత‌ర పార్టీల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తుండ‌టంతో ఇప్పుడు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాల‌నే డైల‌మా ప‌వ‌న్‌ను వెంటాడుతోంద‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి!

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించేసిన త‌ర్వాత‌.. ప‌వన్ కొన్ని రోజుల‌కు సైలెంట్ ఆయిపోయారు. అయితే పార్టీ నిర్మాణ కార్య‌క్ర‌మాల్లో ఈ మ‌ధ్య ప‌వ‌న్ బిజీబిజీ అవుతున్నారు. గత ఎన్నికల కంటే ముందే పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టారు. అప్పటి కప్పుడు బీజేపీకి, టీడీపీకి మద్దతు ప్రకటించాడు. ఇపుడు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన పవన్‌.. పార్టీ బలోపేతంపై సీరియస్‌గా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కార్యకర్తల శిబిరాలు నిర్వహించారు. జనసైనికులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా పార్టీ లక్ష్యాలను ప్రచారం చేసేందుకు ఆన్‌లైన్ టీంను కూడా తయారు చేసుకున్నారు. ప్లీనరీ కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నారు.

అయితే ప‌వ‌న్ మ‌ద్ద‌తు కోసం అన్ని పార్టీలు ఇప్ప‌టికే ఓపెన్ ఆఫ‌ర్లు ఇస్తుంటే.. ఆయ‌న కూడా మ‌రో పార్టీకి ఆఫర్ ఇవ్వ‌డం.. అంతేగాక ఆ పార్టీ నేత‌లు ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడటం ఇప్పుడు హాట్ న్యూస్‌గా మారింది. ప్రజా సమస్యలపై కామ్రేడ్‌లతో పోరాడేందుకు సిద్ధ‌మేన‌ని ప‌వ‌న్ గ‌తంలోనే ప్ర‌క‌టించేశాడు. అంతేగాక త‌న‌పై క‌మ్యూనిస్టుల ప్ర‌భావం చాలా ఉంద‌ని కూడా చెబుతుంటారు. పార్టీ పెట్టక ముందు నుంచి కమ్యూనిస్ట్‌ పార్టీలపై పవన్‌కల్యాణ్‌కు మంచి అభిప్రాయం ఉంది. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ ఆఫర్‌పై కమ్యూనిస్ట్‌లు స్పందించారు. కలిసి నడిచేందుకు సిద్ధమన్న పవన్‌ ఆఫర్‌పై కమ్యూనిస్ట్‌లు పాజిటివ్‌గా ఉన్నాట్లు చెబుతున్నారు. 

పవన్‌ వస్తానంటే కలిసి నడిచేందుకు సిద్ధమంటున్నారు క‌మ్యూనిస్టులు. జనసేన విధి విధానాలను స్పష్టంగా ప్రకటిస్తే.. ఆఫర్‌పై ఆలోచిస్తామన్నారు సీపీఎం సీనియర్‌ నేత రాఘవులు. మరోవైపు ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ ప్రజల్లోకి రావడం మంచిదేనన్నారు. ఇప్పటికే రామకృష్ణ, నారాయణ, రాఘవులు వంటి నేతలు గతంలో ఓసారి ఆయనతో సమావేశమయ్యారు. ఫుడ్‌ పార్క్‌తో పాటు పలు స‌మ‌స్య‌ల‌పై కమ్యూనిస్ట్‌లతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే ప‌వ‌న్ కోసం అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా వేచి ఉన్న విష‌యం తెలిసిందే! మ‌రి ప‌వ‌న్ ఎటువైపు అడుగు వేస్తార‌నే సందేహాలు.. అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి!!

2019లో పోటీపై ప‌వ‌న్ డైలమా… జ‌న‌సేన‌లో ఏం జ‌రుగుతోంది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share