
వామపక్షాలు విజయవాడలో నిర్వహించిన మహాగర్జన సభకు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం, కనీసం ఆయన పార్టీ కూడా అందులో భాగం పంచుకోకపోవడం అనేది కీలకంగా గమనించాల్సిన విషయం. ఇటీవలి కాలంలో.. తెదేపా మీద కన్నెర్ర చేయడం ప్రారంభించిన నాటినుంచి, ఆ మాటకొస్తే తాను పార్టీ పెట్టిన నాటినుంచి కూడా పవన్ కల్యాణ్ ఏపీలో వామపక్షాల మీద చాలా వరకు ఆధారపడుతూ వచ్చారనే సంగతి అందరికీ తెలుసు. వాపమక్షాల నాయకులను కలిసిన ప్రతిసారీ.. వీరితో కలిసి మేం పోటీచేస్తాం అని పవన్ గతంలో పలుమార్లు చెప్పారు.
నేను కూడా ఒకప్పుడు కమ్యూనిస్టును, మా నాన్న కూడా కమ్యూనిస్టు, మా నాన్న స్ఫూర్తితోనే కమ్యూనిస్టులు అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పట్లో నేను నక్సలైట్లలో కూడా కలిసిపోవాలనుకున్నాను.. లాంటి పడికట్టు మాటల ప్రయోగాలు.. పవన్ గతంలో అనేకం చేశారు.
కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ ప్రాపకం కోసం ఆ పార్టీలు ఆరాటపడుతోంటే మాత్రం.. ఆ రెండు పార్టీలను పూర్తిగా దూరం పెట్టేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. విజయవాడలో శనివారం నాడు నిర్వహించిన మహాగర్జన సభ కోసం కొన్ని నెలలనుంచి వామపక్ష నేతలు పవన్ ను కలుస్తూనే ఉన్నారు. అసలు దీనిని లెఫ్ట్-జనసేన కూటమి సభగానే నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ నో చెప్పడంతో కేవలం లెఫ్ట్ మహా గర్జన గానే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
మిత్రపక్షం గనుక.. పవన్ కూడా ఈ సభలో పాల్గొంటారని అన్నారు. కానీ పవన్ డుమ్మా కొట్టారు. తాజాగా భాజపా వారి డైరెక్షన్ లోనే పవన్ ఆ విధంగా చేశారనే మాట బలంగా వినిపిస్తోంది. పవన్ భాజపా స్కెచ్ మేరకు, వారి మీద సూటిగా విమర్శలు సంధించకుండా జాగ్రత్తగా కదులుతున్నారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. తాజాగా వామపక్షాల సభకు కూడా వెళ్లకపోవడం అంటే.. మోడీ చెప్పుచేతల్లో ఉంటూ, ఆయన గీసిన గీత దాటకుండా నడుచుకోవడం మాత్రమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇన్నాళ్లుగా రెండు పార్టీలను నమ్మించి, వారు తనపై అనేక ఆశలు పెట్టుకున్నాక.. ‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న’ అన్న సామెత చందంగా వారిని మధ్యలోనే విడిచిపెట్టడం అంటే.. ఇలాంటి వైఖరి ఉన్న పవన్ ఎవరికి మాత్రం న్యాయం చేయగలరని పలువురు విస్తుపోతున్నారు.