పవన్ సీఎం పదవిపై ప్రజలు సెటైర్లు!

October 16, 2018 at 10:50 am
222222222

సెంటిమెంట్లు పండించ‌డంలో టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబును మించిన వారు ఎవ‌రూ ఉండ‌ర‌ని అంద‌రూ అంటారు. ఆయ‌న ఏ అవ‌కాశం వ‌చ్చినా .. దానిని త‌న‌కు అనుకూలంగా సెంటిమెంటును రాజేసేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాట‌లో న‌డుస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. తాజాగా ఆయ‌న ధ‌వ‌ళేశ్వ‌రం వంతెన‌పై భారీఎత్తున పాద‌యాత్ర‌(క‌వాతు) నిర్వ‌హించి.. అనంత‌రం పెద్ద స‌భే పెట్టారు. దానిలో ఆవేశంగా కూడా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న అటు టీడీపీని, ఇటు చంద్ర‌బాబును, ఆయ‌నపుత్ర‌ర‌త్నాన్ని కూడా ఏకేశారు. స‌హ‌జంగా దీనిని అంద‌రూ ఊహించారు. 2014 నాటి వాతావ‌ర‌ణం ఇప్పుడు టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య లేక‌పోవ‌డంతో.. ఏ చిన్న ఛాన్స్ దొరికినా ప‌వ‌న్ చంద్ర‌బాబును ఉతికి ఆరేస్తున్నారు కాబ‌ట్టి..తాజా క‌వాతు స‌భ‌లోనూ ఆయ‌న‌ను టార్గెట్ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అనుకున్న విధంగానే ప‌వ‌న్ భారీగానే మాట‌ల తూటాలు పేల్చారు.

అయితే, ఈ సంద‌ర్భంగానే ఆయ‌న సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ క‌లిపి త‌న ప్ర‌సంగాన్ని దంచి కొట్టారు. సీఎం పదవి త‌న‌కు అలంకారం కాదు అంటూ.. చంద్రబాబు, లోకేశ్‌లాగా వారసత్వం కాదు.. సీఎం కావాలన్న వారసత్వం నాకు లేదఅన్నారు. అయితే, అంత‌టితో ఆగ‌కుండా.. ఆయ‌న‌ నా తండ్రి ఓ కానిస్టేబుల్‌ నుంచి పైకెదిగిన వ్యక్తి. చిన్న జీవితం నాది. మా తాత, నాన్న సీఎం అయ్యారు గనక నేనూ అవుతా అని లోకేశ్‌ అనుకున్నప్పుడు.. ఒక కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించిన వ్యక్తి కొడుకు ఈ రాష్ట్రానికి ఎందుకు సీఎం కాలేడు. కచ్చితంగా అవుతాడు అని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నిక‌లు తనకు మూడో ఎన్నికలని.. ఆ అనుభవాన్ని తీసుకొని 2019 ఎన్నికలకు వెళ్తున్నట్టు పవన్‌ స్పష్టంచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. సీపీఎస్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. ప్రభుత్వోద్యోగులకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.

ప్రజలు తమకు అండగా నిలబడితే అనని సీట్లూ గెలిచి చూపిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా నిరూపిస్తామని స్పష్టంచేశారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ప్రత్యేక హోదాపై అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నిలదీద్దామని పిలుపునిచ్చారు. అయితే, ఈ వ్యాఖ్య‌ల‌తోనే ప‌వ‌న్ ఇప్పుడు నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయాడు. కానిస్టేబుల్ కుమారుడే ఎందుకు కావాలి? త‌ను ముందుండి.. వేరే వారికి ముఖ్యంగా తాను మ‌హిళా ప‌క్ష‌పాతిన‌ని చెబుతున్న ప‌వ‌న్ ఓ మ‌హిళ‌ను ఎందుకు ముఖ్య‌మంత్రిని చేయ‌కూడదు? అంటూ ప్ర‌శ్నించారు. వీర మ‌హిళ అధ్య‌క్షురాలిని ఎందుకు సీఎంను చేయ‌కూడ‌దు? అన్న‌వారు కూడా ఉన్నారు. ఇక‌, మ‌రికొంద‌రు మ‌రో రెండ‌డుగులు ముందుకు వేసి.. ఎస్సీ, ఎస్టీలంటే.. త‌న‌కు ప్రాణ‌మ‌ని, అంబేద్క‌ర్ సిద్ధాంతాల‌ను తాను న‌మ్ముతాన‌ని చెబుతున్న‌ప్పుడు ఎస్సీ ఎస్టీల‌కు ఎందుకు ఆ ప‌ద‌విని త్యాగం చేయ‌కూడ‌దు? అన్న వారుకూడా ఉన్నారు.

ఇక‌, ఈ వాద‌న‌కు తోడు.. స‌రికొత్త వాదన కూడా ముందుకు వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి తాను ప్ర‌చారం చేశాన‌ని, కాబ‌ట్టే గెలిచింద‌ని చెబుతున్న ప‌వ‌న్‌.. ఇప్పుడు కూడా త‌న ప్ర‌చారంతో జ‌న‌సేన‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చి.. త‌న ప్ర‌చారంతో అణ‌గారిన వ‌ర్గాల‌కు సీఎం సీటును ఇచ్చేలా చేయొచ్చు క‌దా? ఇలా ఎందుకు ఆలోచించ‌డం లేదు? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌ట్టి పిసుక్కునేవాడు మాత్రం సీఎం కాకూడ‌దా? అని స‌టైర్లు వేసిన వారు కూడా క‌నిపించారు. ఏదేమైనా.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం జోరుగా సాగుతున్న స‌మ‌యంలో సెంటిమెంట్ కోసం నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను నెటిజ‌న్లు బాగానే వాడుకుంటున్నార‌ని చెప్ప‌డానికి ప‌వ‌న్ వ్యాఖ్య‌లే ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

పవన్ సీఎం పదవిపై ప్రజలు సెటైర్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share