పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా న‌డుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వ‌డంతో కులాల ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు జ‌రిగాయి. టీడీపీకి క‌మ్మ‌, బీసీ వ‌ర్గాలు, కాంగ్రెస్‌కు రెడ్డి, ఎస్సీ వ‌ర్గాలు, ప్ర‌జారాజ్యానికి కాపు వ‌ర్గం ఎక్కువుగా మ‌ద్ద‌తు ఇచ్చాయి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌డంతో మ‌రోసారి అగ్ర కులాల్లో క‌మ్మ‌లు టీడీపీ వైపు, రెడ్లు వైసీపీ వైపు, కాపులు జ‌న‌సేన వైపు ఎక్కువుగా మొగ్గు చూపుతార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ప‌వ‌న్ కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో పాటు అన్ని కులాల్లోను యూత్‌లో మంచి పేరు ఉండ‌డం కూడా ప‌వ‌న్‌కు క‌లిసొస్తుంద‌ని అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఎలా ఉన్నా ప్ర‌జెంట్‌గా చూస్తే కాపులు ప‌వ‌న్‌పై పీక‌ల్లోతు కోపం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఓ వైపు కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం వారంతా గ‌ళ‌మెత్తుతుంటే ప‌వ‌న్ మాత్రం మౌనం దాలుస్తుండ‌డం వారికి న‌చ్చ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఈ విష‌య‌మై హామీ ఇచ్చింద‌ని, ప‌వ‌న్ కూడా టీడీపీకి స‌పోర్ట్‌గా ప్ర‌చారం చేశాడ‌ని, మ‌రి ఇప్పుడు ప‌వ‌న్ కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం, ముద్రగడ దీక్ష భగ్నం చేసినప్పుడు ఎందుకు స్పందించ‌డం లేద‌ని కాపులు, కాపు సంఘాలు ఆయ‌న‌పై గుర్రుగానే ఉన్నాయి.

అయితే ప‌వ‌న్ అండ్ జ‌న‌సేన వ‌ర్గాల వెర్ష‌న్ మ‌రోలా ఉంది. పవన్ మాత్రం తన మీద కులం ముద్ర పడకుండా ఉండటానికే కాపు రిజర్వేషన్ల విషయంలో పెద్దగా స్పందిండం లేదని వారంటున్నారు. గ‌తంలో చిరు ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన‌ప్పుడు ఆ పార్టీపై కాపు ముద్ర బాగా ప‌డిపోయింద‌ని… అందువ‌ల్లే ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జారాజ్యానికి ఉన్న ఊపు ఎన్నిక‌ల్లో లేకుండా పోయింద‌ని, మిగిలిన వ‌ర్గాలు ఆ పార్టీకి దూర‌మైన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఆ భ‌యంతోనే ప‌వ‌న్ ఇప్పుడు కాపు ముద్ర లేకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు ఆ పార్టీ వ‌ర్గాల ఇన్న‌ర్ వెర్ష‌న్‌.