ప‌వ‌న్‌పై `శ‌త‌ఘ్ని` టీమ్ ఫైర్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే

March 21, 2018 at 4:58 pm
pawan-janasena-sathagni

నాయకుడు తీసుకునే నిర్ణ‌యాలు ఎంత బ‌లంగా ఉంటే.. సైన్యం కూడా అంతే స్థాయిలో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడి చేయ‌గ‌లుగుతుంది. మ‌రి నాయ‌కుడి నిర్ణ‌యాలే గంద‌ర‌గోళంగా ఉంటే.. సైన్యం ఎంత బ‌లంగా ఉన్నా.. ప్ర‌త్య‌ర్థులు చేసే దాడికి త‌లొగ్గ‌వ‌ల‌సిందే!! ఇప్పుడు జ‌న‌సైన్యం ప‌రిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోయిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. ప్ర‌త్యేక‌హోదా బ‌దులు ప్యాకేజీ ప్రక‌టిస్తే.. పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చారంటూ కేంద్రాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హోదా కంటే నిధులు ముఖ్య‌మ‌ని చెప్పార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా వీటినే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తుండ‌టంతో.. జ‌న‌సేన సోష‌ల్ మీడియా వింగ్ `శ‌త‌ఘ్ని` ఇప్పుడు ఢీలా ప‌డిపోయింది. ప్ర‌త్య‌ర్థుల దాడిని చిత్తు చేయ‌లేక‌.. ఒక‌వేళ ఎదురుదాడి చేసినా ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా ప‌నిచేయ‌డంలో ఫెయిల్ అయిపోయింది.  

 

జ‌న‌సేన ప్ర‌ధాన బ‌లం యువ‌త‌. పార్టీ కార్య‌క్ర‌మాలు, సిద్ధాంతాలను ప్ర‌జ‌ల‌తో పాటు యువ‌త‌లోకి తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్య‌మాల‌ను వీలైనంతగా వినియోగించుకోవాల‌ని ప‌వ‌న్ బ‌లంగా న‌మ్ముతూ ఉన్నారు. ఇందులో భాగంగా ముందుగా సోష‌ల్ మీడియా విభాగాన్ని ప్రారంభించారు. అత్యంత కీల‌క‌మైన ఈ విభాగానికి అంతే శ‌క్తిమంత‌మైన `శ‌త‌ఘ్ని` అని పేరు పెట్టారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చురుగ్గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన ఈ విభాగం.. ఇప్పుడు ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల‌తో గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ ని పవన్ టార్గెట్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో పవన్ మీద దాడి ఉధృతమైంది. 

 

ఇన్నాళ్లూ త‌మ‌తో ఉన్న ప‌వ‌న్‌.. ఇప్పుడు స‌డ‌న్‌గా అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం వెనుక బీజేపీ ప్యాకేజీ ఇచ్చింద‌ని, ర‌హ‌స్య ఒప్పందం కుదుర్చుకున్న‌ర‌ని టీడీపీ నేతల‌తో పాటు టీడీపీకి మ‌ద్ద‌తుగా ఉన్న కొన్ని గ్రూపులు ప్ర‌చారం ప్రారంభించాయి. అయితే అంతే స్థాయిలో శ‌త‌ఘ్ని టీమ్ కూడా ప్ర‌త్య‌ర్థుల‌కు కౌంట‌ర్ ఇస్తూనే వ‌స్తోంది. అయితే ప‌వ‌న్ ఇటీవ‌ల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రత్యేక హోదా కన్నా నిధులు ముఖ్యం అని చెప్ప‌డంతో.. జనసేన.. బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందన్న ప్రచారం మ‌రింత‌ ఊపందుకుంది. చివరకు పవన్ వీరాభిమానులు కూడా ఈ వాదనలు ఖండించలేని పరిస్థితుల్లోకి వెళ్లారు. జనసేన తరపున టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్లు ఈ మాటల దాడిని నిలువరించడంలో విఫల‌మ‌వుతున్నారు. వారి అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

 

టీవీ చర్చల్లో వైఫల్యం ఎలా ఉన్నప్పటికీ కనీసం సోషల్ మీడియాలో అయినా జనసేన తరపున శతఘ్నులు పేలతాయని ఆశించినవాళ్లకు నిరాశే ఎదురైంది. సోషల్ మీడియాలో పవన్ మీద దాడిని ఎదుర్కోవడంలో శతఘ్ని అట్టర్ ప్లాప్ అయ్యింది. పవన్ అనుకూల వాదన వినిపించడం మాట పక్కనబెట్టి కనీసం ఆయన బీజేపీ తొత్తు కాదు అని చెప్పడంలో కూడా విఫలమైంది. ఇదే విషయంపై శతఘ్నిలో కీలక బాధ్యతలు చూస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పవన్ తీసుకున్న వైఖరి, మాట తీరుతో ప్రజలు ఆయన్ని బీజేపీ అనుకూల వాడిగా చూడ‌టంతో తాము ఎంత చెప్పినా అంగీకరించే పరిస్థితి లేరు అని స్ప‌ష్టంచేశారు. ఆ విధంగా పవన్ చేసిన తప్పున‌కు జనసేన శతఘ్ని పేలకుండా తుస్ అంది.

ప‌వ‌న్‌పై `శ‌త‌ఘ్ని` టీమ్ ఫైర్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share