కుల రహిత సమాజమంటే ఇదేనా పవన్

March 20, 2019 at 3:30 pm

త‌న‌కు కులం లేదు.. మ‌తం లేదు.. మ‌నుషులంద‌రూ స‌మాన‌మేన‌ని.. స‌మ‌స‌మాజ స్థాప‌నే త‌న ల‌క్ష్య‌మ‌ని డైలాగ్స్ దంచికొట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చేస‌రికి తుస్సుమ‌నిపించాడు. ఈ ఎన్నిక‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి ప‌రువు కాపాడుకునేందుకు కుల‌బలాన్నే న‌మ్ముకున్నాడు. త‌న సామాజిక‌వ‌ర్గం కాపు ఓట‌ర్లు అత్య‌ధికంగా ఉన్న రెండు స్థానాల నుంచి ఆయ‌న బ‌రిలో దిగ‌డంలో ఆంత‌ర్యం ఇదేన‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఓవైపు ప‌వ‌న్‌లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంది.. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు స్థానాల‌ను ఎంచుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏమిటంటే.. కుల‌బ‌లం కోసం ప‌వ‌న్ పాకులాడ‌డ‌మే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ప‌వ‌న్ భీమవరం, గాజువాక స్థానాల్లో పవన్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోని సామాజిక స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిశీలిస్తే విష‌యం అర్థ‌మ‌వుతుంది. భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014లో టీడీపీ తరపున రామాంజ‌నేయులు విజయం సాధించారు. వైసీపీ కూడా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన గ్రంధి శ్రీనివాస్‌కే టికెట్ ఇచ్చింది. భీమవరం నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,10,128మంది. అయితే వీరిలో కాపు సామాజిక వర్గ ఓటర్లే అధికం. కాపు ఓటర్ల తర్వాత బీసీ, క్షత్రియ సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కువ. అందుకే కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ ఇక్క‌డి నుంచి పోటీ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

గాజువాక నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాపు సామాజిక‌వ‌ర్గం నిర్ణ‌యాత్మ‌క‌శ‌క్తిగా ఉంది. ఇక్క‌డ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప‌ల్లా శ్రీ‌నివాస్‌, వైసీపీ నుంచి తిప్ప‌ల నాగిరెడ్డి మ‌రోసారి బ‌రిలోకి దిగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఓట‌ర్లు 2,74,15మంది ఉన్నారు. ఇక్క‌డ కాపు ఓట‌ర్ల త‌ర్వాత యాద‌వ సామాజిక ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గుచూపితే.. వారితే విజ‌యం. ఈ త్రిముఖ పోరులో కాపు, యాద‌వ‌సామాజిక‌వ‌ర్గాలు ఎవ‌రికి మ‌ద్ద‌తు తెలుపుతాయ‌న్న విష‌యం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది. కులాన్ని న‌మ్ముకుని బ‌రిలోకి దిగుతున్న కాపుసామాజిక‌వ‌ర్గం ప‌వ‌న్‌కు ఏమేర‌కు మ‌ద్ద‌తు ఇస్తుందో చూడాలి. అయితే.. మ‌రొక విష‌యం ఏమిటంటే.. భీమ‌వ‌రం నియోజ‌వ‌ర్గం బ‌రిలో ఉన్న ప‌వ‌న్‌తోపాటు రామాంజ‌నేయులు, గ్రంధి శ్రీ‌నివాస్‌.. ఈ ముగ్గురూ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం.

కుల రహిత సమాజమంటే ఇదేనా పవన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share