పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్

February 11, 2017 at 6:55 am
paw

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు నడుస్తోంది. ఈసారి ఎలాగైనా ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకుని అధికారాన్ని సొంతం చేసుకోవాల‌ని ఒక‌రు దృఢ నిశ్చ‌యంతో ఉంటే.. మ‌రొక‌రు త‌మ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి భావి నాయ‌కుడిగా ఎద‌గాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రూ త‌మ త‌మ వ్యూహాల‌తో మునిగితేలుతూ.. బ‌లాన్ని పెంచుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా గుంటూరులో ప‌వ‌న్ ప‌ర్య‌టిస్తుండ‌టంతో.. అంత‌కు ముందుగానే జ‌గ‌న్ అక్క‌డ ప‌ర్య‌టిస్తుండ‌టంతో మ‌రోసారి ఆస‌క్తిక‌ర పోరుకు తెర‌లేచింది. దీంతో రాబోయే కాలంలో వీరిద్ద‌రి మ‌ధ్య బిగ్ ఫైట్ త‌ప్పేలా క‌నిపించ‌డంలేదు.

ఏపీలో ఇద్దరు యువనేతలు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, జ‌గ‌న్‌ తమ ఉనికి కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే వీరిమ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన యుద్ధం న‌డుస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి నుంచి జ‌గ‌న్.. ప్ర‌జ‌ల్లో నిలిచేందుకు చేయ‌ని ప్రయ‌త్నం లేదు. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌న్‌.. ఆ కూట‌మిపై ఎదురు దాడిచేయ‌డం ప్రారంభించిన నాటి నుంచి జ‌గ‌న్‌.. ఒకడుగు వెన‌కే ఉంటున్నారని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

రాజ‌ధాని రైతుల భూముల విష‌యం, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం, ఉద్దానంలో కిడ్నీ స‌మ‌స్య‌లు, ఇత‌ర‌ ప్ర‌జాస‌మస్య‌ల‌పై పోరాడే విష‌యంలో అన్నింటా ప‌వ‌న్ ముంద‌డుగు వేస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి కూడా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌టం కూడా జ‌గ‌న్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పవన్‌ కన్నా తాను ముందుండాలనే తాపత్రయం జగన్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవ‌డంలో జ‌గ‌న్ విఫలమవుతున్నారనే విమర్శ ఉంది. వీరి పోటీ ప్రజలకు ఆసక్తి కల్గిస్తోంది.

తాజాగా గుంటూరు జిల్లాలో పవన్‌ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి మంగళగిరిలో 20వ తేదీన కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ఈ విషయం తెలిసిన వెంటనే వైకాపా నాయకులు 16వ తేదీనే జగన్‌ పర్యటనను గుంటూరులో ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి పవన్‌ చేనేత సమస్యల గురించి స్పందించకు ముందు వైకాపా గుంటూరు జిల్లాలో ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకోలేదు. పవన్‌ గుంటూరు వస్తే ఆయనకు క్రెడిట్‌ వెళుతుందనే ఉద్దేశంతో గుంటూరులో యువభేరీని నిర్వహించబోతున్నారు వైకాపా నాయకులు. మొత్తం మీద సొంతంగా ప్రజా సమస్యలపై ఉద్యమించ‌లేకే త‌మను ఫాలో అవుతున్నారని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు.

పవన్ కు చెక్ చెప్పేలా జగన్ ప్లాన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share