తెలంగాణ‌లో రాజుకున్న రాజ‌కీయం

కోయిల ముందే కూసింది అన్న‌ట్టుగా.. 2019 ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల టైం ఉండ‌గానే తెలంగాణ‌లో పాలిటిక్స్ హీటెక్కాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యూహాత్మ‌కంగా అప్పుడే అడుగులు క‌దుపుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ 2019లో తెలంగాణ‌లో పాగా వేయాల‌ని కాంగ్రెస్, బీజేపీలు ప‌క్కా ప్లాన్‌ను సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రూపాల్లో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై యుద్ధం చేసిన ఈ రెండు పార్టీలు ఇక నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

దీంతో తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ కాక‌రేపుతుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీ కూడా రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించు కోవడంపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నల్గొండ జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మరో వారం రోజుల వ్యవధిలో కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ కూడా సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతున్నారు.

మ‌రి ఈ రెండు జాతీయ పార్టీలూ ఇలా వ్యూహంతో ముందుకు పోతుంటే.. తెలంగాణ పోరాట యోధుడు, ప్ర‌స్తుత సీఎం కేసీఆర్ ఊరుకుంటారా? ఆయ‌న కూడా త‌న వ్యూహానికి ప‌దును పెట్టారు. ఇటీవ‌లు పెద్ద ఎత్తున ప్లీన‌రీ నిర్వ‌హించిన ఆయ‌న పేద‌ల‌పై వ‌రాల వ‌ర్షం కురిపించారు. ప్ర‌తి ఇంటికీ మేక‌లు, గొర్రెల పంపిణీ, ఉపాధి క‌ల్ప‌న‌, ఆదాయం పెంపు, డ‌బుల్ బెడ్ రూం వంటి హామీల‌తో దూసుకుపోతున్నారు. సో.. ఇలా 2019 ఎన్నిక‌ల‌పై తెలంగాణలో ఇప్పుడే వేడి రాజుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇక‌, ఎన్నిక‌లు స‌మీపించే నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.