నందుల గోల‌.. లోకేష్‌పై నిప్పులు చెరిగిన పోసాని

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నంది పుర‌స్కారాలు తీవ్ర వివాదానికి కార‌ణ‌మైన విష‌యం తెలిసిందే. నందుల‌కు కులాల‌ను కూడా ముడిపెడుతూ కామెంట్లు వ‌చ్చాయి. ఇక‌, రాజ‌కీయాల‌తోనూ నందుల‌ను ముడిపెట్టి ఏకేశారు. ఇక‌, ఈ వివాదం స‌ర్దుమ‌ణుగుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌.. చేసిన కామెంట్లు చ‌ల్లారుతున్న మంట‌ను ఎగ‌దోసిన‌ట్ట‌యింది! సోమ‌వారం ఆయ‌న నంది అవార్డుల‌పై కామెంట్లు చేశాడు. ఎక్క‌డో(హైద‌రాబాద్‌)లో ఉండి నందుల‌పై కామెంట్లు చేయ‌డం కాదు అంటూ హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల‌పై కామెంట్లు కుమ్మ‌రించాడు. ఇక‌, వీరికి ఆధార్‌, ఓటు హ‌క్కు వంటివి హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని, వీరంతా ఎన్ ఆర్ ఏల‌ని సంచల‌న కామెంట్ చేశాడు లోకేష్‌. 

ఈ ఎన్ ఆర్ ఏ కామెంటే బాబు కొంప‌మీద‌కి తెచ్చింది. ఇప్పుడు ఇదే విష‌యంపై తెలంగాణ స‌హా ఏపీలోనూ నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ రంగానికి చెందిన ఫైర్ బ్రాండ్ పోసాని కృష్ణ‌ముర‌ళి.. మంత్రి లోకేష్‌పై నిప్పులు చెరిగారు.  తాము తెలుగు రోహింగ్యాలమా? అని ప్ర‌శ్నించారు.  ‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.?..లోకేశ్‌… చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా… మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా..? ఏపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ(తెలంగాణ‌) ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు’ అంటూ ప్రశ్నించారు. 

“నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా?. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్‌ లోకల్‌ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్‌ లోకల్‌ అంటారా?. 2024 వరకూ హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా?“ అని నిప్పులు చెరిగారు. 

“విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా?“ అని పోసాని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తానికి స‌మ‌సి పోతోంద‌ని భావించిన నంది అవార్డుల వివాదం ఉన్న‌ట్టుండి ఇలా లోకేష్ వ్యాఖ్య‌ల‌తో యూట‌ర్న్ తీసుకోవడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. మ‌రి ఇది ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి. ఏదేమైనా వివాదాల విష‌యంలో స్పందించేట‌ప్పుడు లోకేష్ఆలోచించుకుని అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

https://youtu.be/YNkJRBUnFh8