కేసీఆర్‌కు పోటీగా ప్రియాంక‌

విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో అస్థిత్వం కోసం కాంగ్రెస్ పోరాడుతుంటే.. తెలంగాణ‌లో మాత్రం అధికారం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ అంతా టీఆర్ఎస్‌కు ద‌క్క‌డం కాంగ్రెస్ హైక‌మాండ్‌ను తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఈసారి ఎలాగైనా తెలంగాణ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ సంపాదించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు కాంగ్రెస్ నేత‌లు!! అయితే ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల్లో ఐక‌మ‌త్యం లోపించ‌డంతో పాటు సీఎం కేసీఆర్ ను డీకొనే స‌రైన వ్య‌క్తి లేర‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్నారు. ఈ త‌రుణంలో తెలంగాణ కాంగ్రెస్‌ను దిశానిర్దేశం చేసి.. నాయ‌క‌త్వం వ‌హించేందుకు కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగబోతున్నార‌ని తెలుస్తోంది!!

తెలంగాణ‌లో పార్టీకి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు త్వ‌ర‌లో `బాహుబ‌లి`వ‌స్తార‌ని కాంగ్రెస్ నేత‌లు ఈ మ‌ధ్య ప‌దేప‌దే చెబుతున్న విష‌యం తెలిసిందే! అదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టే స‌రైన‌ వారు లేక నాయ‌కులు ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో తెలంగాణ‌లో పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపేందుకు వీలైనంత‌గా కాంగ్రెస్ శ్ర‌మిస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఉత్తమ్‌ స్పీడ్‌తో పార్టీ గ్రాఫ్‌ పెరుగుతున్నా దీనికి మరింత బలాన్ని జోడించేందుకు అధిష్టానం యాక్షన్‌ ప్లాన్‌ మొదలు పెట్టబోతోంది.

త్వ‌ర‌లోనే పార్టీ ప‌గ్గాలు పూర్తిగా రాహుల్ గాంధీ చేతుల్లోకి వెళ్లిపోతాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సార‌థ్యంలో ఎన్నిక‌లు వెళుతుంద‌ని.. కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. రాహుల్ ప‌ట్టాభిక్షేకం పూర్తయిన తర్వాత పార్టీలో ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త‌న సోద‌రి ప్రియాంక గాంధీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించబోతున్నారని టాక్‌. పార్టీకి బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న ప్రియాంక గాంధీ తెలంగాణ పార్టీపై స్పెషల్‌ ఫోకస్‌ పెడతారని సమాచారం. ఇప్పుడు ఇదే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. రాహుల్‌కు ప్రియాంక తోడైతే 2019 లోదేశ‌వ్యాప్తంగా పార్టీకి లాభం జ‌రుగుతుందని హ‌స్తం నేత‌లు భావిస్తున్నారు.

రాహుల్‌కు తోడు ప్రియాంక‌కు ఉన్న చ‌రిష్మా పార్టీకి క‌లిసి వ‌స్తుంద‌నేది అధిష్టానం ఆలోచ‌న‌. ద‌క్షిణాదిలో తెలంగాణను అత్యంత కీల‌కంగా భావిస్తున్న రాహుల్ ఎట్టిప‌రిస్థితుల్లో 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్పట్నుంచే వ్యూహాలు ర‌చి స్తున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ అస్త్రాన్ని తెలంగాణ‌పై సంధించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మొత్తంగా 2019లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కలలు కంటున్న కాంగ్రెస్ హైక‌మాండ్.. పక్కా ప్లాన్‌తోనే ముందు కెళ్తోంది. మ‌రి వ్యూహాల్లో ఆరితేరిన కేసీఆర్‌ను ప్రియాంక ఎలా ఎదుర్కొంటారో వేచిచూడాల్సిందే!