చంద్ర‌బాబు హైటెక్ రాజ‌ధాని బాగోతం ఇదేనా?!

త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా.. త‌ర‌త‌రాలు నిలిచిపోయేలా .. రాజ‌ధానిని నిర్మిస్తున్నాం. దీనికోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తాం. ఇది అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌. దీనిలో భాగంగా ముందు స‌చివాల‌యం, త‌ర్వాత అసెంబ్లీని తాత్కాలిక ప్రాదిప‌దిక‌న‌(తాత్కాలికం ఎందుక‌ని విప‌క్షం ప్ర‌శ్నించ‌గానే.. కాదు కాదు… ఇవి శాశ్వ‌త నిర్మాణాలు అని చెప్పుకొచ్చారు.) నిర్మించిన ఈ భ‌వ‌నాల‌కు వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును ధారా ద‌త్తం చేశారు. షాపోర్ జీ, ప‌ల్లోంజీ ల‌కు దీని బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక‌, ప్ర‌భుత్వ అనుకూల మీడియా అయితే, ఈ కాంట్రాక్టు పొందిన సంస్థ‌ల గొప్ప‌ల మెప్పులు చెప్పేందుకు పేజీల‌కుపేజీలు కేటాయించింది. దీంతో అంద‌రూ కూడా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ నిర్మాణాలు క‌డుతున్నార‌ని భావించారు. ఆ నిర్మాణాలు శ‌ర‌వేగంగా పూర్త‌య్యాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అల్లుడి సంబరం.. అర‌ట్టుతోనే స‌రి! అన్న ఓల్డ్ సామెత‌ను గుర్తుకు తెచ్చాయి ఈ భ‌వ‌నాలు. ముఖ్యంగా మాది అంత‌ర్జాతీయ రాజ‌ధాని అని ప‌దే ప‌దే చెప్పుకొనే చంద్ర‌బాబు ప‌రువును ఈ భ‌వ‌నాలు నేల మ‌ట్టం చేసి.. గాలివాన‌లో క‌లిపేశాయి.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. నిన్న ఆక‌స్మికంగా విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భారీ వ‌ర్షం దుమ్ముదులిపింది. ఈ దెబ్బ‌కి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన అసెంబ్లీ భ‌వ‌నం నీటిలో చిక్కుకుపోగా.. సాక్షాత్తూ.. విప‌క్షం నేత జ‌గ‌న్‌కి కేటాయించిన చాంబ‌ర్‌.. పైనే పెద్ద బొక్క‌ప‌డింది. దీంతో వ‌ర్షపు నీరు నేరుగా జ‌గ‌న్ చాంబ‌ర్‌ను ముంచెత్తింది. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. రికార్డు స్థాయిలో..అద్భుతంగా తాము తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాలు కట్టామని చంద్రబాబు గొప్పగా చెబుతుంటే..నింకా నిండా ఏడాది కూడా పూర్తి కాని భవనాల్లోకి నీరు కారటం ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఇమేజ్ కు చిల్లు పెట్టినట్లు అయింది.

దీనిపై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన కామెంట్లు కురుస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక కామెంట్లు చేసిన వారిని దోషుల్లా చూస్తున్న ప్ర‌భుత్వం .. ఇప్పుడు ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి. మొత్తానికి ఈ వ‌ర్షం ప‌డ‌డం, చాంబ‌ర్‌కు చిల్లు ప‌డ‌డం వెనుక కూడా జ‌గ‌న్ కుట్ర, వైసీపీ హ‌స్తం ఉంద‌ని బాబు అంటారో ఏమో?!! ఏమైనా అనొచ్చు. సీఎం క‌దా!!