ఏపీలో మేక‌ప్‌.. ప్యాక‌ప్‌! ఇక‌.. ద‌ర్శ‌కుల పాల‌న‌.. !

అవును! ఏపీలో చంద్ర‌బాబు త‌న పాల‌న‌ను ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీకి అప్ప‌గించే ప‌నిలో ప‌డ్డారు. అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చేసిన చంద్ర‌బాబు.. దాని డిజైన్ల‌ను ఖ‌రారు చేయ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని చేతులు ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సినీ ద‌ర్శ‌క దిగ్గ‌జంగా అవ‌త‌రించిన బాహుబ‌లి రాజ‌మౌళిని ఆశ్ర‌యించారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో అమ‌రావ‌తి డిజైన్ల‌ను ఖ‌రారు చేయాల‌ని ఐఏఎస్ సీనియ‌ర్ అధికారులు స‌హా మంత్రి నారాయ‌ణ‌ను సైతం ఆదేశించిన విష‌యం తెలిసిందే. దీంతో అయ్య‌వారి అనుమ‌తేచాలు అనుకుంటూ.. వారంతా పొలోమ‌ని నిన్న హైద‌రాబాద్‌లో ఉన్న రాజ‌మౌళి కార్యాల‌యాన్ని చుట్టేశారు.

గంట‌కు పైగా రాజ‌మౌళితో చ‌ర్చ‌లు జ‌రిపారు. దీనిపై ఏం క్లారిటీ వ‌చ్చిందో తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఇక‌, ఇప్పుడు పోల‌వ‌రం ప‌నుల‌ను స‌మీక్షించిన చంద్ర‌బాబు దీనిని వాయు వేగ‌, మ‌నోవేగాల‌తో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టులో జ‌రుగుతున్న లోపాల‌ను గుర్తించి వాటిని స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా దీనిని ఒక్క‌రోజు జాప్యం చేసినా స‌హించేది లేద‌ని కుంబ‌ద్ద‌లు కొట్టారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు అధికారుల్లో ఓ టాపిక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. బాబు.. ఎలాగూ అమ‌రావ‌తిని జ‌క్క‌న్న చేతిలో పెట్టారుకాబ‌ట్టి.. పోల‌వ‌రాన్ని వీవీ వినాయ‌క్ చేతిలోపెడ‌తారేమో అని గుస‌గుస‌లాడు కుంటున్నారు.

బన్నీ న‌టించిన ఓ సినిమాలో వినాయక్ పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాడు. సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది. అందుకే రానున్న రోజుల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు వినాయక్ కు అప్పగించే అవకాశం లేక‌పోలేద‌ని కొంద‌రు

అధికారులు స‌ణిగారు కూడా. అయితే, నిజానికి సినీ ఇండ‌స్ట్రీకి ప్ర‌భుత్వ పాల‌న‌లో ఇలా భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సినిమాల‌ను ఏదో మ‌సిపూసి.. మెప్పిస్తార‌న్న విష‌యం బాబుకు తెలియ‌దా? అని కూడా అంటున్నారు. అదేస‌మ‌యంలో బాహుబ‌లి వంటి హిట్‌ను జ‌క్కన్న అందించ‌డంపై ఎలాంటి సందేహం లేకున్నా.. ఆ సినిమా అలా హిట్ అవ‌డానికి గ్రాఫిక్స్ దోహ‌ద ప‌డ్డాయ‌న్న విష‌యం బాబు ఎందుకు గుర్తించ‌లేక‌పోతున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అలాంటిది ఇప్పుడు రాజ‌ధాని విష‌యంలో నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సిన చంద్ర‌బాబు ఏదో ప్ర‌చారం కోసం.. సినిమా వాళ్ల‌పై ఆధార‌ప‌డ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌నే ప్ర‌శ్న వ‌స్తోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే.. సెట్టింగ్‌ల సామ్రాట్ విఠ‌లాచార్య ద‌ర్శ‌కుడు బ‌తికి ఉంటే.. బాబు ఆయ‌న‌నే ఆశ్ర‌యించే వార‌ని పాత కాలం సీనియ‌ర్ అధికారులు బాబు గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి .. బాబు ఈ విష‌యంలో పున‌రాలోచించుకోవాలి. అంత‌ర్జాతీయ స్థాయి అమ‌రావ‌తిని ఇలా కామెడీ చేసేయ‌డం ఏమ‌న్నా బాగుందా?!