కొడంగ‌ల్‌కు రేవంత్ బైబై… ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే టార్గెట్‌..!

October 20, 2017 at 10:09 am
Telangana, Kodangal, Revanth reddy, TDP, Politics

టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సైకిల్‌ దిగడం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీ ఆ పార్టీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రేవంత్ త‌నతో పాటు పార్టీ మారే త‌న వ‌ర్గానికి కూడా సీట్లు ఇప్పించుకునేలా రాహుల్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న పెట్టి స‌క్సెస్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తోన్న రేవంత్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ప్ర‌స్తుతం ప్రాథినిత్యం వ‌హిస్తోన్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి బైబై చెప్ప‌నున్న‌ట్టు కూడా తెలుస్తోంది.

రేవంత్ టీడీపీ త‌ర‌పున 2009, 2014 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా కొడంగ‌ల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక కొద్ది రోజుల క్రితం రేవంత్ పార్టీ మార్పు ఊసు లేన‌ప్పుడు ఆయ‌న ప‌క్క‌నే ఉన్న క‌ల్వ‌కుర్తి నుంచి పోటీ చేసేందుకు ఇంట్ర‌స్ట్‌గా ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. క‌ల్వ‌కుర్తిలో టీఆర్ఎస్ వీక్‌గా ఉంది. ఇక్క‌డ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీచంద‌ర్‌రెడ్డికి మంచిప‌ట్టుంది. ఇక్క‌డ వంశీ గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి ఆచారి మీద కేవ‌లం 78 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

దీంతో రేవంత్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంశీచంద‌ర్‌మీద టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని ప్లాన్‌లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న అనూహ్యంగా పార్టీ మారిపోతుండ‌డంతో క‌ల్వ‌కుర్తి సీటు ఇస్తారా ? లేదా ? అన్న‌ది చూడాలి. అక్క‌డ ఉన్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీచంద‌ర్ రెడ్డి కూడా రాహుల్‌గాంధీకి అత్యంత స‌న్నిహితుడు. దీంతో రేవంత్ త‌న కొడంగ‌ల‌కు ప‌క్క‌నే ఉన్న తాండూర్ నుంచి పోటీ చేస్తార‌న్న చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

రేవంత్ కాంగ్రెస్ ఎంట్రీతో వికారాబాద్‌ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. రేవంత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ పక్కనే తాండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ ప్రాంతంలోనూ రేవంత్‌కు కొంత మేర పట్టుంది. పరిగి నియోజకవర్గంలోనూ ఆయనకు అనుచరగణం ఉంది. ఇవే కాకుండా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, మహేశ్వరం, కూకట్‌పల్లి, తదితర నియోజకవర్గాల్లోనూ రేవంత్‌కు సొంత కేడర్‌ ఉంది.

తాండూర్‌లో ప్ర‌స్తుతం మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్క‌డ ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. ఇక్క‌డ కాంగ్రెస్‌కు కూడా స‌రైన అభ్య‌ర్థి లేరు. ఇక దీనికి తోడు ఇక్క‌డ ఉన్న మంత్రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కాకుండా శేరిలింగంప‌ల్లి నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లెక్క‌న చూస్తే అటు మంత్రి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిపోవ‌డం, కాంగ్రెస్‌కు స‌రైన అభ్య‌ర్థి లేక‌పోవ‌డం రేవంత్‌కు క‌లిసొచ్చేలా ఉంది. దీంతో రేవంత్‌కు ఇక్క‌డ ప‌ట్టుఉండ‌డం కూడా ప్ల‌స్‌.

 

కొడంగ‌ల్‌కు రేవంత్ బైబై… ఆ నియోజ‌క‌వ‌ర్గ‌మే టార్గెట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share