త‌మిళ‌నాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్‌

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంకు అవ‌కాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత శ‌శిక‌ళ స్థానంలో ఎంపికైన ప‌ళ‌నిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకేకు 89 మంది, ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలు, ఇండియ‌న్ ముస్లిం లీగ్‌కు మ‌రో ఎమ్మెల్యే ఉన్నారు. సీఎంగా ఎన్నిక‌య్యే వ్య‌క్తి స‌భ‌లో మెజార్టీ నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ లెక్క‌న అన్నాడీఎంకేకు ప్ర‌స్తుతం ఉన్న 135 మందిలో ఎంత‌మంది ప‌ళ‌నిస్వామికి మ‌ద్ద‌తు ఇస్తారు ? ఎంత‌మంది సెల్వం వెంట వ‌స్తార‌న్న‌దే ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. గ‌వ‌ర్న‌ర్ ప‌ళ‌నిస్వామికి ఛాన్స్ ఇస్తే ఆయ‌న అసెంబ్లీలో మెజార్టీ మార్క్ అయిన 117 మందితో బ‌లం నిరూపించుకుంటారా ? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఎవ‌రు ఈ ప‌ళ‌నిస్వామి…?

ఇక కొత్త సీఎం రేసులో శ‌శిక‌ళ వ‌ర్గం వ్య‌క్తిగా అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చిన ప‌ళ‌నిస్వామి అన్నాడీఎంకే సీనియ‌ర్ నేత‌. ఆయ‌న చిన్న‌మ్మ‌కు వీర విధేయుడు. ఆమెకు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆయ‌న తెర‌మీద‌కు వ‌చ్చారు. పన్నీర్‌ సెల్వం కేబినెట్‌లో రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామి సేలం జిల్లా ఎడప్పడి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

1974 నుంచి అన్నాడీఎంకేలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా ప్రారంభ‌మైన ఆయ‌న ప్ర‌స్థానం ఎమ్జీఆర్ మ‌ర‌ణాంత‌రం కూడా జ‌య‌ల‌లిత వ‌ర్గానికే మ‌ద్ద‌తుగా నిలిచారు. 1989, 1991, 2011, 2016లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్త‌వానికి జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో ఉన్న‌ప్పుడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా ప‌న్నీరు సెల్వంతో పాటు ప‌ళ‌నిస్వామి పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు చెపుతారు. అయితే అప్పుడు శ‌శిక‌ళ మాత్రం ప‌ళ‌నిస్వామి వైపే మొగ్గు చూపింద‌ని టాక్‌. ఇక ఇప్పుడు శ‌శిక‌ళ‌కు జైలు శిక్ష ప‌డ‌డంతో ప‌ళ‌నిస్వామికే ఛాన్స్ ద‌క్కింది.