క‌థ‌-స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చ‌ంద్ర‌బాబు

హెడ్డింగ్‌ విన‌డానికి షాకింగ్‌గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో మాత్రం ఇదే జ‌రుగుతోంది. `అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ను లక్ష్యంగా చేసుకునే ప‌వ‌న్ దీనిని ప్ర‌క‌టించాడా? అనే సందేహం క‌ల‌గ‌క‌మాన‌దు. `అన్న వ‌స్తున్నాడు` పేరుతో జ‌గ‌న్.. అక్టోబ‌ర్ నుంచే పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ కూడా రంగంలోకి దిగుతుండ‌టం.. అది కూడా సీఎం చంద్ర‌బాబుతో భేటీ అనంత‌రం ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం.. వెనుక ప‌క్కా `చంద్ర‌బాబు` స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే ఉంద‌నేది విశ్లేష‌కుల అంచ‌నా!

ఏపీ రాజ‌కీయాల్లో ఏదో జ‌రుగుతోంది. పైకి అంతా తెలిసిన‌ట్టే ఉన్నా.. అందరిలోనూ ఇంకా సందేహాలు మెదులుతూనే ఉన్నాయి. 2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌.. విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో నిన్న మొన్న‌టి వ‌ర‌కూ జ‌గ‌న్‌, జ‌నసేనాని ప‌వ‌న్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు నెల‌కొంది. ప్ర‌జ‌ల్లోకి జ‌గ‌న్ వెళుతూ.. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదుగుతున్న స‌మ‌యంలో.. ఎవ‌రో చెప్పిన‌ట్లు స‌రిగ్గా సేమ్ టైమ్‌లో సీన్‌లోకి ప‌వ‌న్ ఎంట్రీ ఇవ్వ‌డం.. `మీ కోసం నేనున్నా. స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌తా` అంటూ భ‌రోసా ఇచ్చి జ‌గ‌న్ మైలేజ్‌ను డ్యామేజ్ చేయ‌డం జ‌రిగిపోయేవి. అన్ని సంద‌ర్భాల్లోనూ ప‌వ‌న్‌ను హీరో చేసేలా స్క్రిప్ట్ రాసింది మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు!

అమరావతి కేంద్రంగా పచ్చని పంట పొలాలను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని వైసీపీ పెద్ద ఎత్తునే ఆందోళన మొదలు పెట్టింది. ఆ ఎపిసోడ్ లో మైలేజ్ పెరుగుతున్న స్థితిలోనే పవన్ ఎంట్రీ ఇచ్చారు . రైతులకు `నేనున్నా` అంటూ సీన్ లోకి వచ్చి హల్ చల్ చేసి షూటింగ్ కి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తీవ్ర ఉద్యమానికి తెరతీసింది. ఉద్యమం విద్యార్థుల స్థాయికి వెళ్లడంతో పవన్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ పై నేరుగా దాడి చేస్తూ స్క్రిప్ట్‌ ప్రకారం బీజేపీని తీవ్రంగా టీడీపీని అంటి ముట్టనట్లు విమర్శలు ఆరోపణలు చేసి తిరుపతి, కాకినాడ, అనంతపురం సభలతో ఆ ఉద్యమాన్ని క్లోజ్ చేశారు .

పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల ఉద్యమంలోనూ వైసీపీ వ‌చ్చే లోపే అక్కడి వారిని తనవద్దకు రప్పించుకుని `నే వున్నా` అంటూ అభయమిచ్చేశాడు. ప్ర‌భుత్వానికి డ్యామేజ్ చేసే అంశాల్లో నేనున్నా అంటూ కాపాడుతూ వ‌చ్చిన ప‌వ‌న్‌.. కాపు రిజ‌ర్వేష‌న్‌, ద‌ళితుల వెలి, విశాఖ భూముల వ్య‌వ‌హారం వంటి కీల‌క‌మైన అంశాల్లో మాత్రం నోరుమెద‌ప‌డం లేదు. మ‌రి వీట‌న్నింటినీ గ‌మ‌నిస్తే.. ఒక‌టి మాత్రం స్ప‌ష్టం అవ‌క మాన‌దు. అదే సీఎం చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే ఇదంతా జ‌రుగుతోంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. జగ‌న్‌ను టార్గెట్ చేసి ప‌వ‌న్‌ను హీరో చేయాల‌నేది ప్ర‌ధాన ల‌క్ష్యం! మ‌రి 2019లో ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే!!