టీ టీడీపీలో ముదిరిన ముసలం

తెలంగాణ తెలుగుదేశంలో ముస‌లం ముదిరిపోయింది. నేత‌ల మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. కొంత‌కాలంగా టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై  ప్రెసిడెంట్ ఎల్‌.ర‌మ‌ణ తీవ్రంగా అస‌హ‌నానికి గుర‌వుతున్నారు. దీంతో ఆయ‌న సైకిల్ దిగి కారెక్కే సూచ‌న‌లు ఉన్నాయ‌ని పుష్క‌లంగా ఉన్నాయ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోంద‌ట‌. ఇందుకు ముహూర్తం కూడా ఖ‌రారైపోయింద‌ట‌. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లితో ర‌మ‌ణ ప్ర‌త్యేక సంప్ర‌దింపులు జ‌రిపిన నేప‌థ్యంలో గులాబీ ద‌ళంలో క్లారిటీ వ‌చ్చింద‌ట‌.

టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ కొద్దికాలంగా పార్టీ నాయకుల తీరుపై అసంతృప్తితో ఉన్నారు. పేరుకే ప్రెసిడెంట్ అని.. త‌న‌తో సంప్ర‌దించకుండానే అన్ని కీల‌క నిర్ణ‌యాలు జ‌రిగిపోతున్నాయ‌ని ఆయ‌న తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఇతర నాయకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరు ఆయ‌న్ను మ‌న‌స్థాపానికి గురిచేస్తోంద‌ట‌. రేవంత్ తనకు కనీస మర్యాద ఇవ్వట్లేదని రమణ ఫీలవుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసినా.. కొంత స‌మయం ఓపిక పట్టాలని సూచించ‌డంతో ఇక ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ట‌.

తెలుగుదేశం పార్టీలోని లుక‌లుక‌లు టీఆర్ఎస్‌కు లాభిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరితోనే  మనస్తాపం చెందిన ర‌మ‌ణ పార్టీ మారే ఉద్దేశంలో ఉన్న‌ట్లు టీఆర్ఎస్‌కు స‌మాచారం అంద‌డంతో నేత‌లు రంగంలోకి దిగిపోయారు. ఇటీవల రమణను ఎర్రబెల్లి క‌లిసి మంత‌నాలు జ‌రిపారు. టీఆర్ఎస్‌లో చేరిక‌పై ఎర్ర‌బెల్లితో ర‌మ‌ణ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది, త్వరలోనే రమణ చేరికపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఎర్రబెల్లి-రమణ మధ్య ఏం చర్చ జరిగిందో… రేవంత్ రెడ్డికి తెలుసట. అందుకే ఆయన ఎర్రబెల్లి.. టీడీపీలోకి వచ్చేస్తారంటూ కౌంటర్ ఎటాక్ చేశారట.

ఏది ఏమ‌యినా.. ఇక పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన నేత‌ల మ‌ధ్య ఇలా విభేదాలు పొడ‌చూపితే పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రి పార్టీలోని విభేదాలు అధినేత చంద్ర‌బాబు ప‌రిష్క‌రిస్తారో లేక‌.. వ‌దిలేస్తారో వేచిచూడాల్సిందే!!