ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి సీఎం అయ్యారు.

శ‌శిక‌ళ త‌న మేన‌ల్లుడు టీవీ దిన‌క‌ర‌న్‌ను సీఎం చేయాల‌ని ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది. ఆర్‌కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో సైతం దిన‌క‌ర‌న్‌ను రంగంలోకి దింపింది. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ ఈ ఎన్నిక‌ను ర‌ద్దు చేయ‌డంతో ఆమె పాచిక పార‌లేదు. ఇక తాజాగా ఇప్పుడు దిన‌క‌ర‌న్ మ‌ళ్లీ ప‌ట్టు సాధించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. జైలు నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే వెలివేత ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ తన బలాన్ని పెంచుకునే పనిలో బిజీ అయ్యారు.

రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి రూ.50 కోట్ల లంచం ఇవ్వ జూపిన కేసులో ఆయ‌న అరెస్టు అయ్యి జైలుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న జైలు నుంచి రిలీజ్ అవుతున్నార‌న్న వార్త‌ల‌తోనే సీఎం ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి వ‌ర్గం ఉలిక్కిప‌డింది. ఆయ‌న జైలు నుంచి రిలీజ్ అయిన వేళ మీడియాతో మాట్లాడుతూ త‌న‌ను పార్టీ నుంచి తొల‌గించే అధికారం శ‌శిక‌ళ‌కు మాత్ర‌మే ఉంద‌ని చెప్పారు.

ఇక ప్ర‌స్తుతం అన్నాడీఎంకేలో బ‌లాబ‌లాలు చూస్తే 135 మందిలో 12 మంది పన్నీరు సెల్వం వ‌ర్గంలో చేర‌డంతో 123 మంది శ‌శిక‌ళ వర్గంలో చేరారు. ఇప్పుడు వీరిలో 22 మంది దిన‌క‌ర‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో ఎడ‌ప్పాడి వైపు 101 మంది మాత్ర‌మే ఉన్న‌ట్లైంది. ఇప్పుడు వీరు ఎడ‌ప్పాడికి మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే ఆయ‌న సీఎం సీటు నుంచి దిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా దిన‌క‌ర‌న్ బ‌య‌ట‌కు రావడంతో ప‌ళ‌నిస్వామి సీఎం పీఠం క‌దులుతున్న‌ట్టే అన్న చ‌ర్చ‌లు త‌మిళ‌నాట బ‌లంగా వినిపిస్తున్నాయి.