పీకే వ్యూహాల‌తో జ‌గ‌నే కాదు…ఆయ‌నా సీఎం అవ్వాల‌ట‌

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహాల‌కు బాగా డిమాండ్ పెరిగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షాల్లో ఉన్న పార్టీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు పీకే ఓ ఆప్ష‌న్‌గా క‌నిపిస్తున్నాడు. పీకే చేప‌ట్టిన ప్రాజెక్టులు గుజ‌రాత్‌, ఢిల్లీ, బిహార్‌, పంజాబ్‌ల‌లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. ఆయ‌న టేకాఫ్ చేసిన ప్రాజెక్టుల్లో ఒక్క యూపీలో మాత్ర‌మే ఫెయిల్ అయ్యింది. ఇక్క‌డ బీజేపీని ఓడించేందుకు ఆయ‌న ఎస్పీ+కాంగ్రెస్‌ను ఒక్క‌టి చేసినా ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు నార్త్‌లో తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న పీకేను తొలిసారిగా సౌత్ కు దింపారు ఏపీలో ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే జ‌గ‌న్‌కు ఇక్క‌డ లైఫ్ లేక‌పోవ‌డంతో ఆయ‌న త‌న తెలివితేట‌ల‌కు తోడు పీకేను కూడా వాడుకుంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పీకే త‌న వ్యూహాల‌తో తెర‌వెన‌క్కే ప‌రిమిత‌మైతే ఆయ‌న్ను జ‌గ‌న్ తెర‌ముందుకు కూడా తీసుకువ‌చ్చారు.

ఇక ప్ర‌శాంత్ ఇప్ప‌టికే ఏపీలో త‌న వ్యూహాల‌ను అమలు స్టార్ట్ చేసేశారు. ఏపీలో కాలుపెట్టిన పీకే ఇప్పుడు ప‌క్క రాష్ట్ర‌మైన త‌మిళ‌నాడులో కూడా కాలు పెట్టినట్లు సమాచారం. ఏపీలో వైసీపీని గెలిపించి, జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్న పీకే ఇప్పుడు త‌మిళ‌నాడులో ప్ర‌తిప‌క్ష‌మైన డీఎంకే అధినేత స్టాలిన్‌ను సీఎం చేసేందుకు అక్క‌డ వ్యూహాలు అమ‌లు చేస్తున్నార‌ట‌.

త‌మిళ‌నాడులో జ‌య‌ల‌లిత మృతితో అక్క‌డ రాజకీయ సంక్షోభం నెల‌కొంది. ఇప్పుడు అక్క‌డ ఏ క్ష‌ణానైనా ఎన్నిక‌లు వ‌చ్చే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అక్క‌డ వ‌రుస‌గా రెండోసారి ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన డీఎంకే అధినేత స్టాలిన్ పీకే సేవ‌ల‌ను వాడుకునేందుకు ఆయ‌నతో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సారి రాష్ట్రంలో పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఇప్ప‌టికే అక్క‌డ ప‌ని ప్రారంభించిన పీకే టీం నియోజ‌క‌వ‌ర్గాల వారీగా మేనేజ‌ర్ల కోసం అప్లికేష‌న్లు స్వీక‌రిస్తోంది. మ‌రి పీకే ఏపీలో జ‌గ‌న్‌ను, త‌మిళ‌నాడులో స్టాలిన్‌ను సీఎం చేసే విష‌యంలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో ? చూడాలి.