త‌మిళ‌నాడులో మారుతున్న పొలిటిక‌ల్ సీన్‌!

త‌మిళ సూప‌ర్ స్టార్.. త‌లైవా.. ర‌జ‌నీకాంత్‌.. త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? త‌న‌కు ఇష్ట‌మైన కాషాయ క‌ల‌ర్‌ను క‌ప్పుకోనున్నారా? ఈ విష‌యంలో నేరుగా రంగంలోకి దిగిన ప్ర‌ధాని మోడీ చేసిన మంత్రాంగం ఫ‌లిస్తోందా? అంటే ఔన‌నే అంటున్నాయి త‌మిళ‌నాడు ర‌జ‌కీయ విశ్లేష‌ణ‌లు. అంతేకాదు… బీజేపీ త‌మిళ‌నాడు ర‌థ సార‌థిగా.. అంతకు మించి త‌మిళ‌నాడు సీఎంగా కూడా ర‌జ‌నీ పేరును బీజేపీ ప్ర‌తిపాదించిన‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. త‌మిళ‌నాడులో క‌నీవినీ ఎరుగ‌ని పొలిటిక‌ల్ సీన్ క్రియేట్ కావ‌డం త‌థ్యం అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని, బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. బుధవారం త‌మిళ‌నాడులోని కరూర్‌లో మీడియాతో మాట్లాడారు. రజనీకాంత్‌ ప్రముఖ నాయకుడని, విశేష ప్రజాదరణ ఉందని అన్నారు. బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో అనుమానమేలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే అంతిమంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

రజనీకాంత్ బీజేపీలో చేరకూడదని వీసీకే నేత తిరుమావళన్‌ కులరాజకీయాలను రెచ్చగొడుతున్నారన్నారని విమ‌ర్శించారు. సో.. నిప్పులేందే పొగ‌రాదన్న‌ట్టు.. ప్ర‌ధాని మోడీ, బీజేపీ అధిష్టానం ఎంత మాత్రం సిగ్న‌ల్స్ ఇవ్వ‌క‌పోతే మంత్రి ఇలా అంటారు? కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ర‌జ‌నీ బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం, త‌ర్వాత సీఎం సీటు ఎక్క‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. మోడీ జ‌మానాలో దేశంలో ఏమైనా జ‌రగొచ్చు. స‌న్యాసులు రాజ్యం ఏల‌ట్లేదా? అంతే!!