ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీకి వాళ్ల బ్రేకులు..!

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం ముందుకు మూడు అడుగులు, వెనక్కు రెండడుగులుగా సాగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు ర‌జ‌నీ కొత్త పార్టీ పెడ‌తారా ? లేదా ఏదైనా పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారా ? అన్న మీమాంస ఉండ‌గానే ఆయ‌న కొత్త పార్టీయే పెడ‌తారంటూ వార్త‌లు వ‌చ్చాయి. ర‌జ‌నీ ప‌దే ప‌దే అభిమాన సంఘాల‌తో మీట్ కావ‌డం, వారు ర‌జ‌నీపై కొత్త పార్టీ పెట్టాల‌ని ప్రెజ‌ర్ చేయ‌డంతో ర‌జ‌నీ కొత్త పార్టీయే పెడ‌తార‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై కొత్త ట్విస్ట్ విన‌ప‌డుతోంది. ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాలా ? వ‌ద్దా ? అన్న అంశంపై డోల‌యామానంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ర‌జ‌నీ గ‌త నెల‌లో అభిమానుల మీట్‌లో సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు. అప్పుడు ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీని కొంద‌రు స్వాగ‌తించ‌గా, మ‌రికొంద‌రు ఆయ‌న్ను టార్గెట్ చేస్తూ విమర్శ‌లు చేశారు. ర‌జ‌నీ త‌మిళేత‌రుడ‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు చేశారు. అప్పుడు ర‌జ‌నీ వాళ్ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇస్తూ

‘యుద్ధం వస్తుంది, ఇపుడు వెళ్లి అపుడు రండి’ అంటూ అభిమానులకు నర్మగర్భంగా సంకేతాలు ఇచ్చారు.

ర‌జ‌నీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. అయితే ఇప్పుడు మాత్రం ర‌జ‌నీ ఈ విష‌యంలో యూ ట‌ర్న్ తీసుకుంటాడంటూ వార్తలు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలా షూటింగ్ గ్యాప్‌లో ఆయ‌న అమితాబ‌చ్చ‌న్‌ను క‌లిసి రాజ‌కీయాల‌పై మీ అభిప్రాయం ఏంట‌ని అడిగార‌ట‌. రాజ‌కీయాల్లో త‌న అనుభ‌వాల‌ను అమితాబ్ ర‌జ‌నీకి వివ‌రించిన‌ట్టు స‌మాచారం.

ఇక చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి ఫెయిల్ అయిన విషయం సైతం వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తాను కొత్త పార్టీ పెడితే త‌మిళ‌నాడులో ఆద‌ర‌ణ ఎలా ఉంటుంద‌న్న అంశంపైనే ర‌జ‌నీ త‌న‌కు స‌న్నిహితులైన వారితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ర‌జ‌నీ కుటుంబ స‌భ్యులు మాత్రం ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది.

వ‌య‌స్సు పై బ‌డ‌డం, అనారోగ్యం దృష్ట్యా ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రావ‌డం కంటే అభిమాన సంఘాల‌తో స‌మాజ‌సేవ చేయ‌డం మేల‌ని సూచిస్తున్నార‌ట‌. వారికి ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ సుత‌రామూ ఇష్టంలేద‌ట‌. అయితే డిసెంబర్‌ 12వ తేదీన రజనీకాంత్‌ జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడగలదని కొందరు నమ్ముతున్నారు.