టీడీపీలో పొత్తు చిచ్చు.. త‌మ్ముళ్లు గ‌రంగ‌రం

June 7, 2018 at 2:04 pm
TDP-

కాంగ్రెస్‌తో పొత్తు వ్య‌వ‌హారం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కొత్త త‌ల‌నొప్పుల‌తో పాటు పార్టీలో చీలిక‌లు తీసుకొస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై ఇంకా ఒక స్ప‌ష్ట‌త రాకున్నా.. క‌ర్ణాటక సీఎంగా కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో మంత‌నాలు, యువ‌రాజు రాహుల్ గాంధీతో ముచ్చ‌ట్లు చూసిన వారికి కొన్ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై ఏపీలో కొంత ఆల‌స్యంగా వార్తలు వినిపిస్తున్నా.. తెలంగాణ‌లో మాత్రం కోయిల ముందే కూసింది. టీఆర్ఎస్‌పై కాంగ్రెస్‌-టీటీడీపీ నేత‌లు చేయిచేయి క‌లిపి పోరాడ‌టం తెలిసిందే! ఏ పార్టీతోనైనా చేతులు క‌లిపేందుకు సిద్ధ‌మ‌ని టీడీపీ నేతలు చెసిన వ్యాఖ్య‌లు.. న‌ర్మ‌గ‌ర్భంగా పొత్తుపై క్లారిటీ ఇచ్చాయి. తెలంగాణ‌లో పొత్తు పెట్టుకుని ఏపీలో విడివిడిగా పోటీ చేస్తే ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. ఈ విష‌యంపై టీడీపీలో తీవ్ర గంద‌ర‌గోళం న‌డుస్తోంది!!

 

కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై టీడీపీ పుట్టింద‌నే విష‌యం రాజ‌కీయాల‌పై ఏమాత్రం అవగాహ‌న ఉన్న వారైనా చెబు తారు. ఇప్పుడు అలాంటి పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందంటూ వ‌స్తున్న వార్త‌లు.. పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నా యి. పార్టీలోని కొంద‌రు ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటే.. మ‌రికొంద‌రు స్వాగ‌తిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. దీనిపై కొంత క్లారిటీ ఇచ్చారు టీటీడీపీ నేత‌లు. కాంగ్రెస్‌తో పొత్తుపై పార్టీ అధినేత చంద్ర‌బాబును కూడా ఒప్పించారు. కాంగ్రెస్ నేత‌ల‌తో క‌ల‌సి టీటీడీపీ నేత‌లు చెట్టాప‌ట్టాలేసు కుని తిరుగుతున్నారు. ఇక ఏపీలోనూ కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న అనంత‌రం.. కాంగ్రెస్‌తో దోస్తీకి చంద్ర‌బాబు ఉత్సుక‌త చూపుతున్నారు. ఇదే ఈ నిర్ణ‌యంపై పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

చంద్రబాబు మాట‌కు ఎదురుచెప్పని వారంతా.. ఆయన నిర్ణయానికి తలూపుతున్నా సీనియర్లు కొందరు మాత్రం ఈ అక్రమ పొత్తును ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. పొత్తు ఇంకా అధికారికంగా కుదరకపోయినప్పటికీ టీడీపీ  కాంగ్రెస్.. భుజంభుజం కలుపుతున్నాయని మాత్రం అంద‌రికీ అర్థమవుతోంది. అందుకు తగ్గట్లుగానే చంద్రబాబుకు వంతపాడే పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. తాజాగా ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు అలాంటివే. అదే సమయంలో ఏపీ మంత్రి, సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి మాత్రం కాంగ్రెస్ తో పొత్తు విషయంలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంత పనీ చేస్తే తాను ఉరేసుకుంటానన్నారు. 

 

ఏపీకి  బీజేపీ న్యాయం చేస్తుందనే నమ్మకం పోయిందని, ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం కంటే బీజేపీ ఎక్కువ అన్యాయం చేసిందని జయదేవ్ అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో కలిసి తాము ముందుకు సాగాలనే విషయమై కాలమే నిర్ణయిస్తుంద న్నారు. ఇదంతా చూస్తుంటే టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఖరారైనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు టీడీపీలోని సీనియర్లు మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకోవడానికి కూడా తాను సిద్ధమని డిప్యూటీ సీఎం కేఈ అన్నారు. ఆయన వ్యాఖ్యల తీవ్రత సీనియర్ల ఆవేదనకు అద్దం పడుతోంది. మ‌రికొంత వ్య‌తిరేక‌త కూడా వచ్చే ప్ర‌మాదం లేక‌పోలేదంటున్నారు విశ్లేష‌కులు.

టీడీపీలో పొత్తు చిచ్చు.. త‌మ్ముళ్లు గ‌రంగ‌రం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share