గుంటూరు జిల్లా టీడీపీ టిక్కెట్లు… షాకింగ్ ట్విస్ట్‌లు

July 16, 2018 at 12:48 pm
TDP-Guntur

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో గుంటూరు జిల్లా నుంచి కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 17 సీట్ల‌కు గాను 12 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో చాలా జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా గుంటూరు జిల్లాలో మాత్రం వైసీపీ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు టీడీపీలో మంత్రుల నుంచి కొత్త ఔత్సాహికుల వ‌ర‌కు చాలా మంది రేసులో ఉన్నారు. రాజ‌ధాని ప్రాంతం కావ‌డంతో ఇక్క‌డ పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లోనూ గ‌ట్టి పోటీయే ఉన్నా అధికార పార్టీ కావ‌డంతో ఇక్క‌డ పోటీకి ఇత‌ర జిల్లాల మంత్రులు కూడా ఆస‌క్తి చూపుతున్నారు.

 

ఈ లిస్టులో మంగ‌ళ‌గిరి సీటుపై ఇద్ద‌రు మంత్రుల క‌న్ను ప‌డింది. చంద్ర‌బాబు త‌న‌యుడు చిత్తూరు జిల్లాకు చెందిన నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌తో ఉన్నారు. విచిత్రం ఏంటంటే లోకేష్‌కు సొంత జిల్లాలో చంద్ర‌గిరి ఆప్ష‌న్‌గా ఉన్నా అక్క‌డ రిస్క్ ఉంటుంద‌ని చంద్ర‌బాబు సైతం హెచ్చ‌రించ‌డంతో లోకేష్ చివ‌ర‌కు కృష్ణా జిల్లాలో పెన‌మ‌లూరుతో పాటు మంగ‌ళ‌గిరి మీద కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. ఇక అదే మంగ‌ళ‌గిరిపై మ‌రో మంత్రి నారాయ‌ణ క‌న్ను కూడా ప‌డింది. లోకేష్ లాగానే నారాయ‌ణ‌ది కూడా సేమ్ ప‌రిస్థితి. నారాయ‌ణ సొంత జిల్లా నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూర‌ల్ నుంచి పోటీ చేస్తే అక్క‌డ రెడ్ల హ‌వా ముందు తాను త‌ట్టుకోలేన‌ని… మంగ‌ళ‌గిరి అయితే సేఫ్ అన్న‌దే ఆయ‌న ప్లాన్‌.

 

నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ పోటీ చేస్తారని గత ఏడాదిన్నర కాలంగా ప్రచారం బలపడింది. ఆ క్రమంలోనే ఆయన నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. అయితే తాజాగా మంత్రి నారాయణ పోటీచేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అంచనాలు మొదలయ్యాయి. ఇక్క‌డ తాను పోటీ చేస్తే సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ఇత‌ర‌త్రా అంశాల ప‌రంగా గ్యారెంటీ లేకపోవ‌డంతోనే ఆయ‌న క‌న్ను కూడా ఇప్పుడు మంగ‌ళ‌గిరి మీదే ప‌డింది. తాను మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తాన‌ని నారాయ‌ణ ఇప్ప‌టికే చంద్ర‌బాబు ద‌గ్గ‌ర కూడా ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన‌ట్టు తెలిసింది.

 

ఇక లోకేష్ పెన‌మ‌లూరుకు వెళితే మంగ‌ళ‌గిరిలో నారాయ‌ణ పోటీ చేసే ఛాన్సులే ఎక్కువ‌. మంగ‌ళ‌గిరిలో నారాయ‌ణ పోటీ చేస్తే జిల్లాలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మీక‌ర‌ణ‌లు మార‌వ‌చ్చు. కాపు వ‌ర్గానికి చెందిన నారాయ‌ణ ఇక్క‌డ పోటీ చేస్తే బాప‌ట్ల‌లో ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ అన్న సతీష్ ప్ర‌భాక‌ర్ దారులు పూర్తిగా మూసుకుపోతాయి. ఆ సీటును ఆశిస్తోన్న వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ‌కు పూర్తిగా లైన్ క్లీయ‌ర్ అయిన‌ట్టే. అలాగే గుంటూరు వెస్ట్ సీటును సైతం కాపుల‌కు ఇచ్చే అంశం ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. మంగ‌ళ‌గిరి, గుంటూరు వెస్ట్ అభ్య‌ర్థుల ఎంపిక బాప‌ట్ల‌లో అభ్య‌ర్థి మార్పున‌కు సంకేత‌మే. వెస్ట్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని మాచ‌ర్ల‌కు పంపేస్తున్నారు. ఇక్క‌డ కాపుల‌కు సీటు ఇచ్చినా బాప‌ట్ల‌లో స‌తీష్‌కు ఎమ్మెల్సీ ఉండ‌డంతో ఆయ‌న‌కు సీటు లేక‌పోవ‌చ్చు.

 

ఇక తాడికొండ నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్ పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయ‌న తాడికొండ నుంచి గ‌తంలో రెండుసార్లు గెలిచి మంత్రిగా కూడా ప‌నిచేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనేక స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌కే సీటు వ‌స్తుంద‌న్న అంచ‌నాలు పెరుగుతున్నాయి. ఇక గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూడా ప్ర‌స్తుత ఇన్‌చార్జ్‌గా ఉన్న మ‌ద్దాలి గిరిధ‌ర్‌రావును త‌ప్పించి అక్క‌డ మైనార్టీ కోటాలో అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌నున్నారు. ఇక్క‌డ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ముస్త‌ఫాకు బ‌ల‌మైన పోటీ ఇచ్చే మైనార్టీ అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. 

గుంటూరు జిల్లా టీడీపీ టిక్కెట్లు… షాకింగ్ ట్విస్ట్‌లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share