జ‌గ‌న్ కోట‌లో టీడీపీ ఖుషీ.. రీజ‌న్ ఇదే!

క‌డ‌ప గ‌డ‌ప‌లో పాగా వేసేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫలించాయా?  ప‌్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ కంచుకోట బ‌ద్ద‌లు కొట్టేందుకు వ్యూహాత్మ‌కంగా తీసుకున్న నిర్ణ‌యాలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయా? ఇక కంచుకోట‌లో జ‌గ‌న్ పని అయిపోయిందా? అంటే అవున‌నే అంటున్నారు క‌డ‌ప టీడీపీ నేత‌లు! నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. వైసీపీ గ్రాఫ్ ప‌డిపోతోందనే చ‌ర్చ రాష్ట్ర‌మంతా జ‌రుగుతోంది. వైసీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో సైకిల్ దూసుకుపోతోంద‌ని స‌ర్వేల్లో కూడా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే ఇప్పుడు జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప‌సుపు జెండా రెపరెప‌లాడేందుకు సిద్ధంగా ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది!

మొన్న‌టి వ‌ర‌కూ పులివెందుల అంటేనే భ‌య‌ప‌డిన టీడీపీ నేత‌లు.. ఇప్పుడు స్వేచ్ఛ‌గా అక్క‌డ తిరుగుతున్నారు! అక్కడి ప్ర‌జ‌ల‌తో మాట్లాడేందుకు ధైర్యం చేయ‌లేని వారు.. ఇప్పుడు వారితో మ‌మేక‌మైపోతున్నారు. జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం, రాజ‌కీయ కోట పులివెందుల‌లో టీడీపీ నిర్వ‌హిస్తున్న `ఇంటింటికీ తెలుగుదేశం` కార్య‌క్ర‌మానికి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. టీడీపీ నాయ‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌డుతున్నారు. దీంతో తెలుగు త‌మ్ముళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది. ముఖ్యంగా జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఇలా జ‌ర‌గ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు!!

కడప జిల్లా  వైఎస్‌ జ‌గ‌న్మోహన్‌రెడ్డి రాజ‌కీయ కంచుకోటలో తెలుగుదేశం పార్టీ `ఇంటింటికీ టీడీపీ` పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అంత‌కు ముందు అంద‌రిలోనూ ఏదో సందేహాలు ఉండేవ‌ట‌. ఎందుకంటే జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ పులివెందులలో ఉన్న మొత్తం గడపల్లో 90 శాతం వైసీపీ అభిమానులవేనని పరిశీలకుల అభిప్రాయం. మిగతా పది శాతం మాత్రమే టీడీపీ పక్షం. ఇలాంటి తరుణంలో పులివెందులలో ఇంటింటికీ వెళ్లడానికి టీడీపీ నేతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవలసి వచ్చింది. అయితే వారు ఊహించింది ఒకటైతే.. జరిగింది మరొకటి. జగన్‌కి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ నేతలను స్థానికులు హాయిగా రిసీవ్‌ చేసుకుంటున్నారట. 

ఊహించని ఈ పరిణామంతో టీడీపీ నేతలు ఎంతో రిలీఫ్‌గా ఫీలవుతున్నారు. పులివెందులలో గడపగడపకీ టీడీపీ నేతలు హాయిగా వెళ్లగలుగుతున్నారంటే… తెలుగుదేశానికి మంచి రోజులు వచ్చినట్టేనని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యాని స్తున్నారు. అదే సమయంలో `జగన్‌కి బ్యాడ్‌ టైమ్‌ మొదలైనట్టేన`ని కూడా చురకలు అంటిస్తున్నారు. పులివెందులలో టీడీపీ నేతలు అంత ఉత్సాహంగా గడప గడపకీ తిరుగుతున్నారంటే.. సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమ ఫలాలు అందరికీ చేరడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ కంచుకోట‌లో ఈసారి లెక్క‌లు మార‌తాయ‌నేది మాత్రం స్పష్ట‌మ‌ని తేల్చిచెబుతున్నారు.