అక్క‌డ టీడీపీని అంద‌రూ గాలికొదిలేశారా..!

కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు. ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ప్ర‌స్తుతం దివంగ‌తులైన‌ప్ప‌టికీ.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న‌ట్టు.. ఆయ‌న పేరు తెలియ‌నివారు లేదు. ఎన్‌టీఆర్ తో మొద‌లు పెట్టిన రాజ‌కీయ ప్ర‌స్థానం.. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అప్ర‌తిహ‌తంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర‌న్నాయుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోట‌గా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాక‌.. ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నారు. ఇక‌, ఎర్ర‌న్న సోద‌రుడు అచ్చెన్నాయుడు కూడా పొలిటిక‌ల్‌గా చాలా యాక్టివ్‌గానే ఉన్నారు.

అయితే, ఇప్పుడు తాజా విష‌యానికి వ‌స్తే.. టీడీపీకి ఇంత‌టి బ‌ల‌మైన జిల్లాలో ఇప్పుడు పార్టీ ప‌ట్టుకోల్పోతోంద‌ని, ఎర్ర‌న్న‌లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేయాల్సిన రామ్మోహ‌న్ నాయుడుకానీ, అచ్చెన్నాయుడు కానీ అలా చేయ‌కుండా చూస్తూ ఊరుకుంటున్నార‌ని ఫ‌లితంగా జిల్లాలో నేత‌ల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేద‌ని, ఈ విష‌యం పార్టీ అధినేత చంద్ర‌బాబుకి తెలిసినా కూడా మౌనంగా ఉంటున్నార‌ని ఇలా అయితే, పార్టీకి రాబోయే ఎన్నిక‌ల్లో తీర‌ని న‌ష్టం జ‌ర‌గ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే.. గ‌త‌ మునిసిపల్ ఎన్నికల్లో పలాస మునిసిపాలిటీలో 25 స్థానాలు ఉండగా వాటిలో ఏకంగా 18 స్థానాలను టీడీపీ గెలుచుకుంది. పార్టీలో సీనియ‌ర్ నేత‌ కోత పూర్ణచంద్రరావు మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొన్నటిదాకా పరిస్థితి బాగానే ఉన్నా… ఇటీవలి కాలంలో పూర్ణచంద్రరావు ఏకాకిగా మారినట్లు కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే – టీడీపీ నేత గౌతే శ్యాంసుందర్ శివాజీతో ఇటీవలి కాలంలో పూర్ణచంద్రరావుకు విభేదాలు వ‌చ్చాయి. ఎర్రన్నాయుడికి కుడిభుజంలా వ్యవహరించిన పూర్ణచంద్రరావును గౌతు దూరంగా పెడుతున్నార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో వెంట‌నే జోక్యం చేసుకుని ప‌రిస్థితి చ‌క్క‌దిద్దాల్సిన అధిష్టానం మౌనంగా ఉంది. అంతేకాదు, ఎర్ర‌న్న త‌న‌యుడు రామ్మోహన్ నాయుడు గానీ అచ్చెన్నాయుడు గానీ పెద్దగా ప‌ట్టించుకోలేదు.

మరోవైపు గౌతు కుమార్తె – జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న గౌతు శిరీష కూడా తన తండ్రి వైపే మొగ్గడం – పూర్ణచంద్రరావును ఏమాత్రం పట్టించుకోకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో తీవ్రంగా మాన‌సిక క్షోభ‌కు గురైన పూర్ణ.. రామ్మోహ‌న్‌, అచ్చెన్నాయుడుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పారు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న పేకాట ఆడుతున్నారంటూ పోలీసులు కేసు న‌మోదు చేశారు. దీంతో వివాదం మ‌రింత ముదిరింది. పరిస్థితి చేయి దాటిపోయిన క్రమంలో చంద్రబాబు ఆదేశాలతో పూర్ణచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చూస్తూ ఉత్తర్వులు జారీ అయిపోయాయి.

పార్టీకి నమ్మినబంటుగా ఉన్న పూర్ణచంద్రరావు సస్పెన్షన్ పై పలాస టీడీపీలో పెను కలకలమే రేగింది. టీడీపీ తరఫున గెలిచిన 18 మంది వార్డు సభ్యుల్లో ఏకంగా ఏడుగురు కౌన్సిలర్లతో పాటు ఓ కో ఆప్షన్ మెంబర్ కూడా నిన్న తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. దీంతో జిల్లాలో ఒక్క‌సారిగా టీడీపీ ప‌రిస్థితి చేయి జారింద‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఎర్రన్నాయుడు బతికి ఉంటే… తనకు ఇంత అన్యాయం జరిగి ఉండేదా? అని పూర్ణ ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ సంక్షోభానికి బాబు తెర‌దించుతారో లేదో చూడాలి. ఇక‌, దీనిని అవ‌కాశంగా తీసుకుని జ‌గ‌న్ త‌న పార్టీని విస్త‌రించుకునే ప్ర‌య‌త్నంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.