ప‌య్యావుల‌కు యాంటీగా టీడీపీలో కుట్ర‌

ప‌య్యావుల కేశ‌వ్‌.. గ‌త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి ఆశించి.. భంగప‌డిన వారిలో ఆయ‌న ఒక‌రు! మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోయినా.. అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేస్తున్నారు! అయితే కొద్దికాలంగా ఆయ‌న‌కు పార్టీలోని నాయ‌కుల నుంచి చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయి. నాయ‌కులంతా ఒక్కటై ఆయ‌న్ను దెబ్బ‌కొట్టేం దుకు కుట్ర ప‌న్నుతున్నారు. జిల్లా రాజ‌కీయాల్లో ఎంతో అపార అనుభ‌వం ఉన్నా.. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు యాంటీగా నాయకులు పావులు కదుపుతున్నారు. కేశ‌వ్‌కు వ్య‌తిరేకంగా స‌హాయ నిరాక‌ర‌ణకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. అంతేగాక ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై బాహాటంగానే విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు.

అనంతపురం జెడ్పీ చైర్మ‌న్ పదవికి చ‌మ‌న్ రాజీనామా చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి జిల్లా రాజ‌కీయాల్లో ర‌క‌ర‌కాల మార్పులు జ‌రుగుతున్నాయి. రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. అయితే ఆ ప‌ద‌వికి అయిష్టంగానే చమన్‌ రాజీనామా చేయటం, దాన్ని కలెక్టర్‌ ఆమోదించడం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బాధ్యతలు స్వీకరించడం ఆనవాయితీ. కానీ జడ్పీ ఛైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ జారీ చేయటంతో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కంగుతిన్నారట. పూల నాగరాజుకు జడ్పీఛైర్మన్‌ పదవి ఇవ్వడం పయ్యావులకు ఇష్టం లేదట. ఇన్ ఛార్జి ఛైర్మన్‌ను ఆరు మాసాలు అదే పదవిలో కొనసాగేలా చేసేందుకు పయ్యావుల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఇప్పుడు కేశ‌వ్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు జిల్లా నాయ‌కులు. గత ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు చమన్‌, మరో రెండున్నరేళ్లు నాగరాజు జడ్పీ ఛైర్మన్‌గా చేయాలని అంగీకరించారు. ఆనీ చమన్‌ ముందుగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే చంద్రబాబు ఆదేశాలతో రాజీనామా చేశారు. ఇప్పటికే ఏడెనిమిది నెలలు అదనంగా ఆ పదవిలో ఉన్నారు. మరో ఆరు మాసాల వరకు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ ఆ పదవిలో ఉండాలని కేశ‌వ్ చెబుతున్నార‌ట‌. విషయం బయటపడడంతో నాగరాజు మద్దతుదారులు కేశవ్‌ తీరును దుయ్యబడుతు న్నారు.

అపారఅనుభవం ఉన్న కేశవ్‌ను దెబ్బకొట్టేందుకు మెజార్టీ నాయకులు ఏకమవుతున్నట్లు తెలిస్తోంది. త్వ‌ర‌లో జడ్పీఛైర్మన్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకోసం ఒక ప‌థ‌కం ప్రకారం పయ్యావుల వ్యవహరిస్తున్నప్పటికీ ఆయనకు పార్టీలో ముఖ్యనాయకులెవరూ సహకరించలేద‌ట‌. ఇప్పటికైనా రాజకీయ కుతంత్రాలు మానుకోవాలని ఆయనకు హితవు చెబుతున్నారు. జడ్పీ ఛైర్మన్‌ విషయంలో పయ్యావుల రాజకీయంగా తప్పటడుగు వేశారని అందుకు ఆయన మూల్యం చెల్లించక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాల్సిందే!!