స‌దావ‌ర్తి భూముల్లో ఆ మంత్రి చ‌క్రం

గ‌డిచిన రెండేళ్లుగా ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన స‌దావ‌ర్తి స‌త్రం భూముల వ్య‌వ‌హారం తాజాగా మ‌రో కీల‌క మ‌లుపు తిరిగింది. అమ‌రావ‌తి ప్రాంతంలోని స‌దావ‌ర్తి స‌త్రం అనాథ‌లు, పేద‌ల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం అందించేది. పూర్తిగా విరాళాల‌పై ఆధార‌ప‌డిన ఈ సత్రానికి ఓ దాత త‌మిళ‌నాడులో చెన్నైకి 30 కిలో మీట‌ర్ల‌లో ఉన్న దాదాపు 100 ఎక‌రాల‌కు పైగా స్థ‌లాన్ని ఇచ్చాడు. అయితే, ఇప్పుడు స‌త్రం బాగోగులు అన్నీ దేవాదాయ శాఖ ప‌రిధిలో కి రావ‌డంతో చెన్నై భూముల‌ను విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, ఈ భూముల‌కు ప‌వ‌ర్ ఆఫ్ అటార్నీ లేక‌పోవ‌డం, కేవ‌లం కొనుగోలు ప‌త్రాలు ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయినా కూడా ఈ భూములు కొనుగోలుకు చాలా మందే పోటీ ప‌డ్డారు. ఈ క్ర‌మంలో మొత్తం 83.11 ఎక‌రాల‌కు గ‌తంలో ప్ర‌భుత్వం వేలం నిర్వ‌హించింది. అప్ప‌ట్లో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామానుజయకు మిత్రుడైన సంజీవ రెడ్డి ఈ భూములను 22.44 కోట్లకు కైవసం చేసుకున్నారు. రామానుజయ.. ఫ్రెండ్‌ చంద్రబాబు, లోకేష్ బినామీ అంటూ విప‌క్షం వైసీపీ నేత‌లు అప్ప‌ట్లో విమ‌ర్శించారు. ఇక‌, అదేస‌మ‌యంలో రాజ‌ధాని ప్రాంతం మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏకంగా కోర్టు త‌లుపు త‌ట్టారు. ప్ర‌భుత్వం అతి విలువైన భూముల‌ను కారు చౌక‌కు క‌ట్ట‌బెడుతోంద‌ని, నేనైతే మ‌రో 5 కోట్లు ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నాన‌ని చెప్పారు.

దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ భూములకు మ‌రోసారి వేలం నిర్వ‌హించారు. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన వేలంలో కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన సత్యనారాయణ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేతలు బీ శ్రీనివాసుల రెడ్డి, ప‌ద్మ‌నాభ‌య్య‌లు దీనిని రూ.60 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈ ఇద్ద‌రు కూడా.. రాత్రికి రాత్రి ఈ వేలంలో పాల్గొనాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే అనేక అనుమానాల‌కు తావిచ్చింది. వీరిద్ద‌రూ కూడా టీడీపీ నేత అనుచరులేనని వైసీపీ మరోసారి ఆరోపిస్తోంది. వేలంలో పాల్గొన్న శ్రీనివాసుల‌ రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అనుచరుడని చెబుతున్నారు.

సోమవారం వేలం జరిగితే ఆదివారం కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి వరదరాజులు రెడ్డి కళాశాలలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అక్కడే ఆదినారాయణ రెడ్డి సదావర్తి భూముల వేలంలో పాల్గొనాలని శ్రీనివాసులు రెడ్డిని కోరినట్లు చెబుతున్నారు. దీంతో మళ్లీ టీడీపీ నేతలే ఈ భూములను దక్కించుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే టీడీపీ మాత్రం వందల కోట్ల విలువైన భూములని వైసీపీ అసత్య ప్రచారం చేసిందని, అంత విలువైన భూములయితే వేలంలో ఎందుకు వెనక్కు తగ్గారని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు నిర్వ‌హించిన వేలంలోనూ ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదిలావుంటే, ఈ వేలం ఆపాలంటూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇటీవ‌ల సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది.