ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!

ఏపీ రాజ‌కీయాల్లో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ త‌ర‌పున ఉద‌యం మీడియా ఛానెళ్ల‌లో ఆయ‌న బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చ‌ర్చ‌లు చూసే వాళ్ల‌లో చాలా మంది ఆయ‌న‌కు మ్యాట‌ర్ తక్కువ‌…మాటలు ఎక్కువ అని కూడా చ‌మ‌త్క‌రిస్తుంటారు. ఇక బొండా గెల‌వ‌డానికి ఫ‌స్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హ‌డావిడి చేస్తుంటారు. గ‌త మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు ముందు వ‌ర‌కు బొండా టీడీపీ త‌ర‌పున మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ ఉమా చంద్ర‌బాబు కాపుల గొంతు కోశారంటూ ఓపెన్‌గానే ఫైర్ అవ్వ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న బాబు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత తన‌ను మీడియా వాళ్లు పిల‌వ‌వ‌ద్ద‌ని కూడా ఆయ‌న ఓపెన్‌గానే చెప్పేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బొండానే ఇంతలా చేస్తే ఏడుసార్లు గెలిచిన ప‌తివాడ నారాయ‌ణ‌స్వామి లాంటి వాళ్లు ఏమైపోవాల‌న్న ప్ర‌శ్న‌లు కూడా వ‌చ్చాయి.

ఇదిలా ఉంటే బొండా లాంటి కాంట్ర‌వ‌ర్సి వ్య‌క్తి రాజ‌కీయ కేంద్ర‌మైన విజ‌య‌వాడ‌లో ఉంటే పార్టీకి, త‌న‌కు త‌ల‌నొప్పి అని భావిస్తోన్న చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌క్క‌న పెడ‌తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ విష‌యం గ్ర‌హించిన బొండా వ‌చ్చే ఎన్నిక‌లకు కాస్త ముందుగా జ‌న‌సేన‌లోకి జంప్ చేసి, విజ‌య‌వాడ‌లో కీ రోల్ ప్లే చేసేందుకు ట్రై చేస్తున్నార‌ట‌. బొండా మ‌నిషి టీడీపీలో ఉన్నా…ఆయ‌న మ‌న‌సంతా జ‌న‌సేన‌లోనే ఉన్న‌ట్టు విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ప్రచారం జ‌రుగుతోంది.

ఇక బొండా కుమారుడు ర‌వితేజ ఇప్ప‌టికే కాంట్ర‌వర్సీల్లో బాగా నానిపోతున్నారు. పవ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలు వస్తున్నాయంటే చాలు ర‌వితేజ చేసే హంగామాకు అంతే ఉండ‌దు. ఇక ఏపీలో ప‌వ‌న్ టూర్ ఉందంటే అక్క‌డ ర‌వితేజ ప్ర‌మేయం డైరెక్టుగానో, ఇన్ డైరెక్టుగానో ఉంటోంద‌ట‌. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌వ‌న్ ఎక్క‌డికి వ‌చ్చినా ప‌వ‌న్‌కు ప‌డే ఫ‌స్ట్ దండ ర‌వితేజ‌నే అన్న టాక్ కూడా ఉంది.

ఇక విజ‌య‌వాడ సిటీ జ‌న‌సేన అధ్య‌క్షుడి పోస్టు మీద యూత్ కోటాలో క‌న్నేసిన ర‌వితేజ చాలా హంగామానే చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టీడీపీలో ఉండి ఈ రెండేళ్ల పాటు ప‌నులు చ‌క్క‌పెట్టేసుకుని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లోకి జంప్ చేసేందుకు ఈ తండ్రి, కొడుకులు రెడీగా ఉన్నార‌న్న‌దే ప్ర‌స్తుతం విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న న్యూస్‌.