ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌: ” గ‌న్ని వీరాంజ‌నేయులు – ఉంగుటూరు “

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాల‌మ్‌లో భాగంగా ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు ఈ మూడేళ్ల కాలంలో ఎలాంటి ప్ర‌గ‌తి సాధించారు ? త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేశారు ? గ‌న్నికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యావ‌కాశాలు ఎలా ఉంటాయో ? చూద్దాం. టీడీపీలో సాధార‌ణ కార్య‌క‌ర్త‌గా కేరీర్ స్టార్ట్ చేసిన గ‌న్ని ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో చ‌చ్చిపోయిన టీడీపీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను బ‌తికించారు. 2009లో గ‌న్ని భార్య ల‌క్ష్మీకాంతం ఇక్క‌డ పోటీ చేసి ఓడిపోయినా 2014లో ఆయ‌న ఎమ్మెల్యేగా తొలిసారి విజ‌యం సాధించారు.

వివాద‌ర‌హితుడు, సౌమ్యుడిగా పేరున్న గ‌న్ని వీరాంజ‌నేయులు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీల‌కు, వ‌ర్గాల‌కు అతీతంగా అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేల ఓటర్లు ఉన్న కాపు వ‌ర్గానికి భారీ స్థాయిలో రుణాలు మంజూరు చేయించారు. కాపు కార్పొరేష‌న్ రుణాల మంజూరులో ఉంగుటూరు ఏపీలోనే ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ కాపు రుణాల వ‌ల్ల 2400 మందికి ల‌బ్ధి క‌లిగింది. ఇక గ‌తేడాది నియోజ‌క‌వ‌ర్గంలో రూ.17 కోట్ల‌తో, ఈ యేడాది రూ. 21 కోట్ల‌తో సీసీ రోడ్ల నిర్మాణం జ‌రిగింది. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌న్ని వ‌చ్చాక చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం జ‌రుపుకుంటున్నాయి.

ఇక వీటితో పాటు బీసీ, ఎస్సీ లోన్ల ద్వారా నియోజ‌క‌వ‌ర్గంలో ఎంతోమంది ల‌బ్ధి పొందారు. పార్టీల‌కు అతీతంగా రేష‌న్‌కార్డులు, పెన్ష‌న్లు మంజూరు చేయ‌డంతో ఎమ్మెల్యేపై అన్ని వ‌ర్గాల్లోను మంచి టాక్ ఉంది. పార్టీల‌కు అతీతంగా ఎవ్వ‌రు పిలిచినా స్పందించ‌డం, కీల‌క‌మైన భీమ‌డోలు మండ‌లంలో ఎమ్మెల్యేకు త‌మ్ముడు, భీమ‌డోలు సొసైటీ ప్రెసిడెంట్ గ‌న్ని నాగ‌గోపాల రావు రైట్ హ్యాండ్‌గా ఉండ‌డం కూడా చాలా ప్ల‌స్ కానుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– వివాదర‌హితుడిగా నియోజ‌క‌వ‌ర్గంలో పేరు

– అధిష్టానం దృష్టిలో సౌమ్యుడ‌న్న ముద్ర‌

– పార్టీల‌కు అతీతంగా అంద‌రూ పిలిచే వ్య‌క్తి

– కాపు కార్పొరేష‌న్ రుణాల మంజూరులో స్టేట్‌లో ఫ‌స్ట్ ర్యాంకు

– చంద్ర‌బాబు సర్వేల్లో టాప్ స్థాయి ర్యాంకింగ్‌

– నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే చాలా అనుకూలాంశాలు

మైన‌స్ పాయింట్స్ (-) :

– నియోజ‌క‌వ‌ర్గంలో కుల బ‌లం లేక‌పోవ‌డం

– జ‌న‌సేన ఎంట్రీ ఇస్తే గ‌త ఎన్నిక‌ల్లో అండ‌గా ఉన్న కాపు వ‌ర్గం దూర‌మ‌య్యే సూచ‌న‌లు

– నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని మండ‌లాల్లో స‌మాంత‌ర అభివృద్ధి లేక‌పోవ‌డం

తుది తీర్పు :

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ మూడేళ్ల‌లో గ‌న్ని వీరాంజ‌నేయులుకు మైన‌స్‌ల కంటే ప్ల‌స్ పాయింట్లే ఎక్కువుగా ఉన్నాయి. వివాద‌ర‌హితుడుగా నియోజ‌క‌వ‌ర్గంలో పేరుతో పాటు చంద్ర‌బాబు వ‌ద్ద మంచి మార్కులే ఉన్నాయి. జిల్లాలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంద‌రితోను స‌మ‌న్వ‌యంతో ఉంటూ నిధులు రాబ‌ట్ట‌డంలో గ‌న్ని నేర్ప‌రిగా పేరొందారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు విష‌యంలోను డౌటే లేదు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న జ‌రిగి ద్వార‌క‌తిరుమ‌ల‌, న‌ల్ల‌జ‌ర్ల మండ‌లాలు ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిస్తే గ‌న్నికి తిరుగులేదు.

ఇక నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌కుండా ప్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఉన్నా, జ‌న‌సేన బ‌రిలో ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో 45 వేల ఓట‌ర్లుగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు చీలే ప్ర‌మాదం ఉంది. అది గ‌న్ని జ‌యాప‌జ‌యాల‌ను ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుందో చెప్ప‌లేం.