టీడీపీ ప్రచారానికి పవన్ వచ్చేసాడుగా!

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ ఏర్ప‌డిన నంద్యాల అసెంబ్లీ సీటుకు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కూడా కాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య పోరు తార‌స్థాయికి చేరుతోంది. టీడీపీ త‌న అధికార బ‌లాన్ని, ధ‌నాన్ని పూర్తిగా కుమ్మ‌రిస్తోంది. అయితే, వైసీపీ మాత్రం సెంటిమెంట్ అనే మ‌రింత బ‌ల‌మైన అస్ర్తాన్ని బ‌య‌ట‌కు తీసి టీడీపీపై పోరాటానికి రెడీ అయింది. ఇక‌, ఈ పోరులో గెలుపెవ‌రిద‌నేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది. ఇదిలావుంటే, నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీతో ఉప్పు నిప్పులా ఉన్న జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్పుడు ఒక్క‌సారిగా కూల్ అయిపోయిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు, నంద్యాల ఎన్నిక‌ల వేళ‌.. త‌న ఫొటోతో ఓట్లు అభ్య‌ర్థించే అవ‌కాశం కూడా టీడీపీకి క‌ల్పించాడ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన ప‌వ‌న్ అవెలా తీసుకుంటార‌ని సీఎం చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. హోదా కోసం అంద‌రూ క‌లిసి పోరాడాల‌న్నారు. టీడీపీ ఎంపీలు తిండిపోతుల‌ని, కేవ‌లం ఢిల్లీ వెళ్లి తిని ప‌డుకుంటార‌ని కామెంట్లు చేసిన ప‌వ‌న్‌.. ఇప్పుడు ఒక్క‌సారిగా మ‌ళ్లీ టీడీపీ అడుగు జాడ‌ల్లో న‌డుస్తుండ‌డం అంద‌రికీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న విష‌యం.

అస‌లు విష‌యం లోకి వెళ్తే.. నంద్యాల ఎన్నిక‌ల పోరులో టీడీపీ నేత‌లు ప‌వన్ ఫోటోను వాడేస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం నిర్వ‌హించినా.. టీడీపీ నేత‌లు ఎక్క‌డా ప‌వ‌న్ ఫొటోల‌ను వాడుకున్న‌ది లేదు. అయితే, అనూహ్యంగా ప‌వ‌న్ ఫొటో నిన్న‌టి నుంచి ద‌ర్శ‌న మిస్తోంది. ప‌వ‌న్ ఫొటోను చూపుతూ.. తెలుగు త‌మ్ముళ్ల ఓట్ల కోసం పాకులాడుతున్నారు.

నిజానికి 2014లో స్థాపించిన జ‌న‌సేన అప్ప‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంది. అయితే, ఆ త‌ర్వాత ప్ర‌త్య‌క్షంగా జ‌రుగుతున్న ఎన్నిక ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీ ప‌రంగా చూసిన‌ప్పుడు జ‌న‌సేనాని నంద్యాల నుంచి పోటీకి దిగాల్సి ఉంటుంది. అయితే, టీడీపీకి 2014లో మ‌ద్ద‌తిచ్చిన‌ట్టే ఇప్పుడు ఇక్క‌డ కూడా టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతాడా? అన్ని స్ప‌ష్టం కాలేదు. మ‌రోప‌క్క‌, టీడీపీ నేత‌లు ప‌వ‌న్ ఫొటోలు పెట్టుకుని ఓట్లు కుమ్మ‌రించేసుకునేందుకు స‌న్నాహాలు తీవ్రంగా చేస్తున్నారు.

మ‌రి ఈ విష‌యంలో ప‌వ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నంద్యాల‌లో తాము పోటీ చేయ‌బోవ‌డం లేదు. కేవ‌లం టీడీపీకి మ‌ద్ద‌తిస్తాం… అని ప్ర‌క‌టిస్తే.. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌కి తెర‌ప‌డే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆదిశ‌గా ప‌వ‌న్ ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారో? ఎప్పుడు ఇస్తారో చూడాలి.