శిల్పా చ‌క్ర‌పాణిని టీడీపీ వ‌దిలించుకోనుందా?

క‌ర్నూలు జిల్లా టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ పీక్ స్టేజ్‌కి చేరింది. నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల నిర్ణ‌యం సెగ‌లు పొగ‌లు క‌క్కిస్తున్న విష‌యం తెలిసిందే. హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన భూమా నాగిరెడ్డి సీటును ఆయ‌న సోద‌రుని కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డికి క‌ట్ట‌బెట్టి.. ఎప్ప‌టి నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న శిల్పా మోహ‌న్‌రెడ్డిని ప‌క్క‌న పెట్టేశారు. దీంతో ఆయ‌న అలిగి.. జ‌గ‌న్ పంచ‌కు చేరిపోయిన విష‌యం తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు శిల్పా ఫ్యామిలీ నుంచి చ‌క్ర‌పాణి రెడ్డి మాత్రమే బాబు చెంత‌న ఉన్నాడు. అయితే, ఆయ‌న‌ను కూడా వ‌దిలించుకోవాల‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే నిన్న‌టికి నిన్న చంద్ర‌బాబు నంద్యాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా.. చ‌క్ర‌పాణికి టీడీపీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. శిల్పా ఫ్యామిలీ సేవ‌ల‌ను ఏ మాత్రం గుర్తు పెట్టుకోకుండా.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న విష‌యాన్ని క‌నీసం మాట మాత్రంగానైనా చ‌క్ర‌పాణికి చెప్ప‌లేద‌ట‌. దీంతో ఆయ‌న తీవ్రంగా హ‌ర్ట్ అయ్యాడు.

అంతేకాదు, బాబు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నూ చ‌క్ర‌పాణి రెడ్డి ఫొటో క‌నిపించ‌లేదు. నిజానికి ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోగా.. క‌నీసం విష‌యం కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి దాపురించింది. ఈ విష‌యంలో చ‌క్ర‌పాణి తీవ్రంగా హ‌ర్ట్ అయ్యార‌ని ఆయ‌న స‌న్నిహితులు పేర్కొన్నారు. నిజానికి మోహ‌న్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన‌ప్పుడే చ‌క్ర‌పాణి కూడా జ‌గ‌న్ చెంత‌కు చేరిపోతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న మాత్రం పార్టీ విష‌యంలో అన్న దారి అన్న‌దే అంటూ.. తాను మాత్రం బాబు ప‌క్షానే ఉండిపోయారు.

అలాంటి చక్ర‌పాణికి ఇప్పుడు పార్టీలో తీవ్ర అవ‌మానం ఎదురైంద‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. ఇది కావాల‌ని చేస్తున్న‌దేన‌ని, ఇంత‌క‌న్నా గౌర‌వంగా పార్టీ నుంచి వెళ్లిపొమ్మంటే వెళ్లిపోతామ‌ని కూడా నిష్టూరంగా చెపుతున్నారు. కానీ, ఇలా మౌనంగా ఉంటూ పొగ‌బెట్ట‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు చ‌క్ర‌పాణి కూడా త్వ‌ర‌లోనే వేరే రూట్ చూసుకోక‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. మ‌రి బాబు వ్యూహం ఎలా ఉందో ఏమిటో తెలియాలి!!