వైసీపీలో స‌మ‌ర్థుల‌కు ప‌ద‌వులు? మ‌రి టీడీపీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్టు బాబు..!

మంత్రి వ‌ర్గంలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చోటు క‌ల్పించ‌డంపై సీఎం చంద్ర‌బాబు ఎట్ట‌కేలకు స్పందించారు. అంతేగాక ఇక్కడొక స‌రికొత్త లాజిక్‌ను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఇక వైసీపీ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగా సమాధానం చెప్పార‌ని టీడీపీ నేత‌లు పైకి చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం తీవ్రంగా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. పార్టీని ఎంతో కాలంగా న‌మ్ముకుని ఉన్న సీనియ‌ర్లు స‌మ‌ర్థులు లేరా? అనే ప్ర‌శ్న ఇప్పుడు వారిలో వినిపిస్తోంది. పార్టీ ఫిరాయించ‌న‌వారే స‌మ‌ర్థులా? మేము కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు పార్టీలో స‌మ‌ర్థులు ఏమైన‌ట్లు అనే చర్చ మొద‌లైంది.

‘మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో సమర్థులను మంత్రివర్గంలో చేర్చుకున్నాం. రాజ్యాంగం ప్రకారం కేబినెట్‌లోకి ఎవరినైనా తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. తెలంగాణలో మా పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి పొందినప్పుడు అది రాజ్యాంగ ఉల్లంఘన అని నేను ఎక్కడా అనలేదు. మా పార్టీ నుంచి తీసుకున్నారు.. మంత్రి పదవి ఇవ్వడం సరికాదన్నాను అంతే. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకోలేదా? అప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గుర్తు రాలేదా?’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు పార్టీలో అంత‌ర్గ‌తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి.

త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకుని వారికి మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టి.. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశార‌ని వైసీపీ నేత‌లు.. సీఎం చంద్ర‌బాబుపై తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని.. టీడీపీ అధినేత స‌మ‌ర్థించు కున్నారు. పార్టీలో చేరిన వారు స‌మ‌ర్థులున్నార‌ని అందుకే వారికి మంత్రి ప‌ద‌వులిచ్చామ‌ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇదే ప‌ద‌వుల కోసం.. టీడీపీలోని స‌మర్థులైన‌ సీనియ‌ర్లు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. కానీ వారి ఆశ‌లు అడియాశ‌లు చేశారు చంద్ర‌బాబు. మ‌రి పార్టీలో ఉన్న వారి స‌మ‌ర్థ‌త గుర్తించ‌కుండా.. పొరుగు పార్టీలోని స‌మ‌ర్థుల‌కు మంత్రి ప‌ద‌వులివ్వ‌డం ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం!!

తన ఫిరాయింపులను సమర్థించుకోవటానికి ఏకంగా ప్రధాని మోడీని కూడా చంద్రబాబు రంగంలోకి లాగారు. టీడీపీ నేతలు ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నారు. బిజెపి గోవాలో ఏమి చేసింది..అంటూ కొత్త రాగం అందుకున్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ఫిరాయింపుదారుల‌కు ప‌ట్టం క‌ట్టి, వారిని అంద‌ల‌మెక్కించ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అనేదే ఇప్పుడు అంద‌రిలోనూ మెదులుతున్న ప్ర‌శ్న‌!!