‘ మ‌హీధ‌ర్ ‘ ద‌మ్ము ముందు ‘ పోతుల ‘ ఆగ‌గ‌ల‌డా..!

July 10, 2018 at 10:47 am
TDP, YSRCP , Prakasam District , Pothula Ramarao , Magunta Maheedharreddy , Kandukuru

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం.  ముఖ్యంగా మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారిపోతున్నాయి. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సిట్టింగు ఎమ్మెల్యేలు మ‌ళ్లీ హ‌వా చ‌లాయించాల‌ని కోరుకుంటుంటే.. వీరిపై పైచేయి సాధించేందుకు ఇత‌ర నాయ‌కులు కూడా చ‌క్రం తిప్పుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా కందుకూరు రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఇక్క‌డ నుంచి 2014లో వైసీపీ అభ్య‌ర్థి పోతుల రామారావు విజ‌యం సాధించారు. అయితే, చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రంతో ఆయ‌న పార్టీ మారిపోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలుపు త‌న‌కే ద‌క్కాల‌నే విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, రాజ‌కీయాల్లో ఎవ‌రూ ఆయా ప‌ద‌వుల‌కు శాస్వ‌తం కాదు కాబ‌ట్టి.. ఇప్పుడు పోతుల‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి తెర‌మీదికి వ‌చ్చాడు. 

 

ప్ర‌కాశం జిల్లాలోని దాదాపు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి ఈ రోజే జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకొని పార్టీలో చేరారు . ఈ ప‌రిణామం వైసీపీలో వేగం పెంచుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో వైసీపీ హ‌వా బాగానే క‌నిపించింది. అయితే, అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు విసిరిన ఆక‌ర్ష్ మంత్రంతో చాలా మంది కీల‌క నేత‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీకి గ‌ట్టి బుద్ధి చెప్పాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో దాదాపు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపించ‌గ‌ల మానుగుంట వైసీపీలో చేరుతుండ‌డాన్ని ఆ పార్టీ నేత‌లు స్వాగ‌తిస్తున్నారు. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహీధరరెడ్డిది రాజకీయ కుటుంబం.

 

ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి కందుకూరు నుంచి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు.  1989  మహీధరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. కందుకూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యపై విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాంను రెండు మార్లు వరుసగా ఓడించి సత్తా చాటారు మానుగుంట. వైఎస్‌ మృతి అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మున్సిపల్‌ శాఖామంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. 

36869918_1860204007333391_3588350055167295488_n

 

చాలా కాలంగా మహీధర్‌రెడ్డి ఆయన అనుచరుల వర్గంతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరుతారన్న టాక్ నడిచింది, ఎట్టకేలకు జగన్ తూర్పు గోదావరి ప్రజా సంకల్ప యాత్రలో కలిసి పార్టీ తీర్థం తీసుకున్నారు. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి తదితర నియోజకవర్గాల్లో మహీధరరెడ్డి ప్రభావం ఉంది. ఇది వైఎస్సార్‌ సీపీకి కలిసి వచ్చే అంశం.  ఇక్క‌డ టీడీపీ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు మానుగుంటను వైసీపీ వినియోగించుకోనుంద‌ని తెలుస్తోంది. అత్యంత సౌమ్యుడు, ప్ర‌జ‌ల మ‌నిషిగా ఆయ‌న గుర్తింపు పొందారు. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో ఆయ‌న ఇక్క‌డ అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్య‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కందుకూరులో పోతుల గెలుపు అంత ఈజీ కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

 

ఇక మ‌హీధ‌ర్‌రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో అణువ‌ణువు తెలుసు. ఆయ‌న స్థానికుడు…గ‌తంలో ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక పోతుల రామారావు నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికేత‌రుడు. ఆయ‌న కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలోని టంగుటూరుకు చెందిన వ్య‌క్తి. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో గెలిచారు. ఇంకా చెప్పాలంటే పోతుల ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ, అటు టీడీపీలోనూ ఇప్ప‌ట‌కీ ప‌ట్టు సాధించ‌లేక‌పోయారు. ఇవ‌న్నీ ఆయ‌న‌కు పెద్ద మైన‌స్‌గా మారాయి. మ‌రి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త అయిన మ‌హీధ‌ర్‌ముందు పోతుల ఎంత వ‌ర‌కు ఆగుతాడో ?  చెప్ప‌లేని ప‌రిస్థితి.

‘ మ‌హీధ‌ర్ ‘ ద‌మ్ము ముందు ‘ పోతుల ‘ ఆగ‌గ‌ల‌డా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share