టీడీపీకి షాక్‌: ఆ కీల‌క నేత పార్టీ వీడ‌తాడా..!

February 13, 2017 at 6:45 am
Gangula

క‌ర్నూలు జిల్లా టీడీపీలో రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్ల‌గడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల‌ప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజ‌కీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వ‌ర్గం, ఆళ్లగ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి వ‌ర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వ‌ర్గం పార్టీ మారే అలోచ‌న‌తో ఉంటే.. ఇప్పుడు గంగుల వ‌ర్గం కూడా దాదాపు పార్టీ మార‌డం ఖాయ‌మైపోయింది. ఇక రేపో మాపో అన్న‌ట్లు ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. వెంట‌నే జిల్లా ఇన్‌చార్జి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు సోమ‌వారం కీల‌క‌మైన స‌మావేశం నిర్వహించాల‌ని నిర్ణ‌యించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరినప్పటి నుంచి గంగుల అసంతృప్తితో ఉన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యాక్రమాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని పలుమార్లు జిల్లా, రాష్ట్ర నాయకత్వం దృష్టికి, ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ముచ్చుమర్రి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఇప్ప‌టికీ దీనిని ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంపై ఆయ‌న అసంతృప్తితో ఉన్నార‌ట‌.

ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర నాయకత్వం దూరంగా పెడుతోందని గంగుల వర్గీయులు భావిస్తున్నారు. అవ మానాలు భరిస్తూ పార్టీలో ఉండడం కన్నా.. వెళ్లిపోవడమే మేలని వారు గంగులపై ఒత్తిడి తెస్తున్నార‌ట‌. ప్రొటోకాల్‌ పేరిట అధికారులు తనను పక్కన బెట్టడం పొమ్మనలేక.. పొగ పెడుతున్నట్లుగా ఉందని గంగుల ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన అత్యంత సన్నిహితులతో సమావేశమయ్యారు. వెంట‌నే ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు గంగులకు శుక్రవారం ఫోన్‌ చేసి సర్దిచెప్పిన అనంతరం గంగుల పునరాలోచనలో పడ్డార‌ట‌.

పార్టీ వీడే అంశంపై చర్చించేందుకు ఆదివారం నిర్వహించదలచిన నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తలు, అనుచరుల కీలక సమావేశం వాయిదా పడింది. ‘మంత్రి అచ్చెన్న ఏం మాట్లాడతారో.. వేచి చూద్దాం..’ అని ఆయన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. అయితే మంత్రితో మాట్లాడిన తర్వాత మరో నిర్ణయం తీసుకుందామనే ఆలోచనతో ఉన్నారని గంగుల సన్నిహితులు తెలిపారు. మంత్రితో చర్చించిన అనంతరం 15న కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. మ‌రి ఇప్పుడు గంగుల‌ వెన‌క్కి త‌గ్గుతారో లేక ముందుకే అడుగేస్తారో వేచిచూడాలి!!

 

టీడీపీకి షాక్‌: ఆ కీల‌క నేత పార్టీ వీడ‌తాడా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share