
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బిగ్‌ఫైట్ లిస్ట్‌లో భూపాలపల్లి నియోజకవర్గం ఒకటి..ఇక్కడ అధికార టీఆర్ ఎస్ పార్టీ నుంచి స్పీకర్ మధుసూదనాచారి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మహాకూటమి అభ్యర్థిగా మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేసిన గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న కీర్తిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా గత ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే నలుగురు ప్రభావంతమైన అభ్యర్థులే.. ఇక్కడ చతుర్మఖ పోటీ తప్పదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.గండ్ర వెంకటరమణారెడ్డి తన సామాజిక వర్గంపై మంచి పట్టున్న నేత. 2014కంటే కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పనిచేశారు. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చారనే అభిప్రాయం జనంలో ఉంది.
అయితే ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం..టీఆర్ ఎస్ వ్యవస్థాపకుల్లో మధుసూదనచారి ఒకడుగా ఉండటం..కేసీఆర్ ఆయన గెలుపునకు ప్రత్యక్షంగా ప్రచారం చేయడం వంటి అంశాలు గత ఎన్నికల్లో గెలుపునకు కారణాలని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి వస్తే స్పీకర్ ప్రభుత్వ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారనే భావన కాంగ్రెస్ నేతల్లో బలంగా నాటుకుంది. దీనికి కోమటిరెడ్డితో పాటు ఇతర నేతలను సస్పన్షన్‌కు గురి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా సభలోకి సభ్యులను అనుమతించలేదని పేర్కొంటున్నారు. దానికి ప్రతీకారంగా ఈసారి ఎలాగైనా స్పీకర్‌ను ఓడించి ఆయన్నే సభలోకి అడుగు పెట్టనీయకుండా చేయాలని వారు గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకే గండ్ర తరుపున ప్రచారం నిర్వహించేందుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారట.
ఇక నలుగురు అభ్యర్థులకు ఓటు బ్యాంకింగ్ ఉంది. ముఖ్యంగా గండ్రసత్యనారాయణకు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది. గత ఎన్నికల్లో నామమాత్రంగా ఉన్న బీజేపీ తరుపున పోటీ చేసి వెంకటరమణారెడ్డితో దాదాపుగా సమాన ఓట్లు సాధించారు. ఇక కొత్తగా బీజేపీ తరుపున పోటీ చేస్తున్న కీర్తిరెడ్డి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. ముఖ్యంగా భూపాలపల్లి పట్టణంలో పార్టీని బాగా విస్తరించగలిగారు. రెడ్డి సామాజిక వర్గంలోనూ పట్టు ఉంది. ఈ పరిణామాలన్నీ ఈసారి చతుర్ముఖ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.