దయనీయంగా తెతెదేపా దుస్థితి!

October 11, 2018 at 12:29 pm

టాప్ స్టార్ల సినిమాలకు నైజాం ఏరియా బంగారు కోడిపెట్ట అయినట్లుగా, ఒకప్పట్లో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ ప్రాంతం చాలా దన్నుగా ఉండేది. కానీ అదంతా గతించిన చరిత్ర మాత్రమే. అప్పట్లో రోజులు బాగుండేవి.. అంటూ తెలుగుదేశం నాయకులు తలచుకుని మురిసిపోవాల్సింది మాత్రమే. అయితే వర్తమానంలో చూస్తే.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. తమకంటూ సొంతంగా బలం లేక, మహాకూటమిలో చేరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు దయపెడితే అన్ని తీసుకోవడానికి సిద్ధంగా న్న తెతేపా… చివరికి కాంగ్రెస్ మీద ఎవరు అలిగినా తామే మధ్యవర్తి పాత్రపోషించడానికి దిగుతోంది.

తెలంగాణలో ఏర్పడిన కొత్త మహా కూటమికి సారథి కాంగ్రెస్. సీట్లు ఇచ్చే పొజిషన్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. వారు అహంకారంతో ప్రవర్తిస్తూ.. కూటమికే తలనొప్పులు తెస్తున్నారు. తమ పార్టీ వ్యూహల్లో వారు మునిగిపోయారే తప్ప.. అసలు భాగస్వామ్య పార్టీలకు సీట్ల పంపకం సంగతి తేల్చలేదు. వారి ప్రతిపాదనల్ని చెవిన వేసుకోవడం లేదు. కోరికల్ని మన్నించేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో తెజస అధినేత కోదండరాం కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల్లోగా సీట్ల పంపకం సంగతి తేల్చకపోతే.. తెజస సొంతంగా పోటీచేస్తుందని ముందుగా 21 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించేస్తామని కోదండరాం హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ తేల్చకపోతే.. భావసారూప్య పార్టీలతో ముందుకెళ్తానని కూడా అంటున్నారు. ఎటూ ఆయన చెలిమి కోసం భాజపా కాచుక్కూర్చుని ఉన్నది.

తమాషా ఏంటంటే.. సీట్లు తేల్చాలంటూ కోదండరాం, కాంగ్రెస్ ను బెదిరిస్తోంటే, ఆ పార్టీ వారు పట్టించుకోవడం లేదు. మధ్యలో తెలుగుదేశం తలదూర్చి, కోదండరాంను బుజ్జగించడానికి ప్రయత్నిస్తోంది. తొలినుంచి కోదండరాంను తెదేపా మాత్రమే బతిమాలుతోంది. కాంగ్రెస్ అంటీముట్టనట్టు ఉంటోంది. పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు కోదండరాం లేఖ రాస్తే, ఎల్.రమణ ఆయనతో భేటీ అయి సర్ది చెబుతున్నారే తప్ప.. కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహాకూటమి మరో ముందడుగు వేసేలా కుప్పకూలిపోయే వాతావరణమే కనిపిస్తోంది. మహా నుంచి తెజస బయటకు వెళ్లిపోతే.. తాము గెలవడం కూడా దుర్లభం అవుతుందని తెతెదేపా నేతలు భయపడుతున్నట్లుంది.

దయనీయంగా తెతెదేపా దుస్థితి!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share