టీజ‌ర్‌లోనే టీడీపీ క‌థ క్లోజ్‌…ఇక మిగిలింది సినిమాయే

ఎస్ ఈ హెడ్డింగ్ నిజ‌మే అనిపిస్తోంది ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి చూస్తుంటే… తెలంగాణ‌లో బీజేపీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న‌లు చేసేసింది. దీంతో టీడీపీ నేత‌లు త‌మ దారి తాము చూసుకోక తప్ప‌డం లేదు. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడును త‌ట్టుకుని నిల‌బ‌డే స‌త్తా త‌మ‌కు లేద‌ని తేలిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో అక్క‌డ కాస్తో కూస్తో మంచి ఫ‌లితాలే సాధించిన టీడీపీ గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో పూర్తిగా తేలిపోయింది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీడీపీ కేవ‌లం ఒక్క వార్డుకే ప‌రిమిత‌మైంది.

బీజేపీతో క‌లిసి వెళ్లేందుకు టీడీపీ ఇష్టంగానే ఉన్నా బీజేపీ మాత్రం టీడీపీతో క‌లిసి వెళ్లేందుకు ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. అప్పటి అవ‌స‌రాన్ని బ‌ట్టి తెలంగాణ‌లో టీఆర్ఎస్‌+బీజేపీ క‌లిసినా షాక్ అవ్వాల్సిన ప‌నిలేదు. ఇక ఇవ‌న్నీ ముందుగానే గ్ర‌హించిన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌తో క‌లిసి అయినా తాము టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా న‌డుస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు.

రేవంత్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన వెంట‌నే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి టీడీపీతో పొత్తుకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. తెలంగాణ‌లో టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డి ఒక్క‌డే ఒంట‌రిపోరు చేస్తున్నారు. అక్క‌డ టీడీపీలో ఉన్న ఒక‌రిద్ద‌రు సీనియ‌ర్లు కూడా ఇప్పుడు పార్టీ కార్యాల‌యానికి రావ‌డం మానేశారు. ఓవ‌రాల్‌గా చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో టీడీపీ బోర్డ్ తిప్పేసే సంకేతాలు ముందుగానే క‌నిపిస్తున్నాయి.

ఏపీ సీఎం చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ తెలంగాణ‌లో పార్టీని గాలికి వ‌దిలేసి, వారు ఇప్పుడు ఏపీకే ప‌రిమిత‌మైపోయారు. వీరిద్ద‌రు ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు, 2019లో అధికారంలోకి ఎలా రావాలి, నంద్యాల ఉప ఎన్నిక లాంటి అంశాల మీదే కాన్‌సంట్రేష‌న్ చేశారు. ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసేందుకు టీటీడీపీ నేత‌లు అమ‌రావ‌తి వ‌స్తామంటే బాబు బిజీ అన్న అంశంతో వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదు.

ఇక త్వ‌ర‌లోనే పార్టీలో ముగ్గురు సీనియ‌ర్ నాయ‌కులు పార్టీకి గుడ్ బై చెప్పేస్తార‌ని తెలుస్తోంది. అదే జ‌రిగితే అప్పుడు టీటీడీపీలో రేవంత్‌రెడ్డి ఒక్క‌డే ఉంటాడు. మ‌రి రేవంత్ టీటీడీపీని ఎన్ని రాజులు మాత్రం మోసుకువ‌స్తాడు. ఏదేమైనా తెలంగాణ‌లో టీడీపీ క‌థ కంచికి చేర‌డం టీజ‌ర్‌లో ఖాయ‌మైపోయింది. ఇక సినిమానే మిగిలి ఉంది.