ఆ స్థానాలపై కాంగ్రెస్ గురి..!

January 11, 2019 at 10:33 am

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రకటనలో జాప్యం కారణంగా తీవ్రంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ ..లోక్‌సభ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ప్రాతిపదికగా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో మహాకూటమికి ఆధిక్యత లభించింది. భువనగిరి, నల్గొండ స్థానాల్లో టీఆర్ ఎస్ కు సమానంగా మహాకూటమి ఓట్లు సాధించింది. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఉన్న ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్గొండ స్థానాల నుంచి పోటీ చేసేందుకు నాయకులు ఆసక్తి చూపుతున్నారు.

ఖమ్మం లోక్ సభ టిక్కెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా రేణుక అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు నేతలు స్థానిక వ్యాపార వేత్త వి రాజాను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొత్తులో భాగంగా ఖమ్మం సీటును టీడీపీ కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గమైన మహబూబాబాద్ సీటును మాజీ ఎంపీ బలరాం నాయక్, కేంద్ర మాజీ మంత్రి రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ రాములునాయక్, బాలునాయక్ తదితరులు ఆశిస్తున్నట్లు సమాచారం.

ఇక భువనగిరి సీటును టీ పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్, పొన్నాల లక్ష్మయ్య తో పాటు మరో బీసీ నేత కూడా ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ లోక్ సభ స్థానానికి గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను కాకుంటే తన కుమారుడు రఘువీర్ పేరును జానా ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మరోపక్క పార్టీ సీనియర్ నేత పటేల్ రమేశ్ రెడ్డి కూడా టిక్కెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఐదుగురు చొప్పున ఆశావాహులు సిద్ధంగా ఉన్నారని ఈ నెలాఖరుకల్లా కసరత్తు పూర్తిచేసి, ఫిబ్రవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. 

ఆ స్థానాలపై కాంగ్రెస్ గురి..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share