తెలంగాణలో సీఎం క్రేజ్ డౌన్ ఫాల్స్ వెనక..?

తెలంగాణ ఉద్యమంతో దేశం మొత్తాన్ని త‌న‌వైపు చూసేలా చేసుకున్న ఏకైక నేత కేసీఆర్‌. తెలంగాణ ఆవిర్భ‌విస్తే.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే సీఎంగా చేస్తానంటూ ఆయ‌న చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న దేశంలోని రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. ఇంత వ‌ర‌కు అలాంటి ప్ర‌క‌ట‌న ఏ ఒక్క‌రూ చేయ‌క‌పోవ‌డమే కార‌ణం. అయితే, య‌ధాలాపంగా ఆయ‌నే సీఎం సీటును అలంక‌రించారు. ఈ ప‌రిణామం తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, బంగారు తెలంగాణ ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగానే తాను సీఎం కావాల్సి వ‌చ్చింద‌ని అంత‌ర్గతంగా ఓ ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్.. నిజంగానే తాను అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డిచిన నేప‌థ్యంలో బంగారు తెలంగాణ‌ను సాధించారా?  పోనీ ఆదిశ‌గా అడుగులు ఏమ‌న్నా వేశారా? అంటే అంతా ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

మ‌న రాష్ట్రం, మ‌న పాల‌న నినాదంతో సెంటిమెంటును ప్ర‌చారం చేసిన కేసీఆర్‌.. ఉద్య‌మం ద్వారా ఈ రెండింటినీ సాధించారు. కానీ, యువ‌త‌, రైతులు, ఉపాధి విష‌యంలో మాత్రం తామింకా ప‌రాయి పాల‌న‌లోనే ఉన్నామ‌ని అనిపిస్తోంద‌నే విమ‌ర్శ‌లు తాజాగా ఊపందుకున్నాయి. దీనికి కేసీఆర్ వైఖ‌రే కార‌ణ‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ముఖ్యంగా పాల‌న అంతా త‌న ద‌గ్గ‌రే కేంద్రీకృతం చేసుకోవ‌డం, కేవ‌లం కేటీఆర్‌కు త‌ప్ప‌.. అన్న‌ట్టుగా మిగిలిన మంత్రుల అధికారాల‌కు క‌త్తెర వేయ‌డం వంటి ప‌రిణామాలు రాష్ట్రంలో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం సాధిస్తే.. ల‌క్ష ఉద్యోగులంటూ ఊరించిన కేసీఆర్‌.. రాష్ట్రం సాకార‌మై రెండేళ్లు గ‌డిచినా అందులో స‌గం పోనీ.. స‌గంలో స‌గం కూడా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోప‌క్క‌, నిధులను నీళ్ల‌లా గా ఖ‌ర్చు చేస్తూ.. నిరుప‌యోగ‌ప‌నుల‌కు వినియోగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఇక‌, మంత్రుల విష‌యంలోనూ నిరాశే ఎదుర‌వుతోంది. పేరుకే తాము మంత్రులుగా ఉన్నామ‌ని, మొత్తం అధికారం అంతా కేసీఆర్ ద‌గ్గ‌రే ఉంద‌ని వారు వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో 2019 నాటికి కేసీఆర్ స‌హా టీఆర్ ఎస్ ప్ర‌భావం తగ్గుతుంద‌నే సూచ‌న‌లు అందుతున్నాయి. మ‌రి ఈ విష‌యంలో కేసీఆర్ ఎలాంటి ముంద‌స్తు వ్యూహం ర‌చిస్తారో చూడాలి.