టీవీ-9 రేటు అన్ని కోట్లా!

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన ర‌విప్ర‌కాశ్ నేతృత్వంలోని ప్ర‌ముఖ టీవీ చాన‌ల్ టీవీ-9. అయితే, దీనిని ఎప్ప‌టి నుంచో అమ్మేస్తార‌ని, రేటు కూడా కుదిరింద‌ని, చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ని, ముహూర్తం కూడా కుదిరింద‌ని, ఇలా అనేక వార్త‌లు గ‌తంలోనే వ‌చ్చాయి. అయితే, ఈ ప్ర‌తిపాద‌న ముందుకు జ‌ర‌గ‌లేదు. అయితే, ఇప్పుడు తాజాగా వ‌చ్చిన వార్త ప్ర‌కారం చూస్తే.. టీవీ-9 అమ్మ‌కం దాదాపు పూర్త‌యిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అండ్ కోకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రిప‌బ్లిక్ టీవీ యాజ‌మాన్య‌మే దీనిని కూడా కొనుగోలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీరి మ‌ధ్య డీల్ కూడా రూ.500 కోట్ల‌ని తెలిసింది.

టైమ్స్ నౌలో ఎంతో పాపులర్ అయిన అర్నాబ్ గోస్వామి రిప‌బ్లిక్ టీవీలో వాటాదారుగా ఉన్నారు. అదేవిధంగా రాజ్య‌స‌భ స‌భ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా రిప‌బ్లిక్ టీవీలో భాగ‌స్వామిగా ఉన్నారు. ఇప్పుడు ఈయ‌నే టీవీ-9ని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నార‌ని స‌మాచారం. రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌కు చెందిన సంస్థ ఏషియా నెట్ న్యూస్ ఆన్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఎన్ వోపీఎల్) ద్వారా టీవీ-9ని కొనుగోలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది పూర్తిగా తుది ద‌శ‌కు చేరింద‌ని దాదాపు 500 కోట్ల‌కు టీవీ-9ని అమ్మేయ‌డం ఖాయ‌మేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి ద‌క్షిణాదిలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో కుదిరితే సొంతంగా లేక‌పోతే.. పొత్తు పెట్టుకుని సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించాల‌ని త‌ద్వారా క‌మ‌ల వికాసం జ‌రిగించాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే టీవీ-9 కొనుగోలు జ‌రుగుతోంది. రిప‌బ్లిక్ టీవీ ఇప్పుడు బీజేపీకి బాగా ఉప‌యోగ ప‌డుతోంది. మోదీపై ప్ర‌త్యేక క‌థ‌నాల‌తోపాటు కేంద్రాన్ని వెనుకేసుకువ‌స్తూ.. ప్ర‌చారం చేస్తోంది. ఇప్పుడు ఇదే టీం టీవీ-9తో తెలుగు రాష్ట్రాల్లో విజృంభించాల‌ని చూస్తోంది. ఇది సాకారం అయితే, బీజేపీకి ప్ర‌చారం చేసుకునేందుకు సొంత‌గా ఓ టీవీ ఏర్ప‌డిన‌ట్టేన‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.