తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రెంటికీ చెడ్డ రేవ‌డేనా?

ఏపీ, తెలంగాణ‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌త‌రించి.. 2019లో కుదిరితే క‌ప్పు కాఫీ.. అన్న‌ట్టు.. వీలైతే అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా ట్రై చేస్తున్న బీజేపీకి ఆదిలోనే హంస‌పాదులా ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం చాల‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఆ పార్టీ చేస్తున్న, చేసుకుంటున్న ప్ర‌చార‌మేన‌నే వాద‌నా వినిపిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందో చూద్దాం… ప‌నిగ‌ట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని భారీ ఎత్తున ఉరుకులు ప‌రుగులు పెట్టిద్దామ‌ని నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం తెలంగాణ‌, ఏపీల‌కు వ‌చ్చిన క‌మ‌ల ద‌ళాధిప‌తి.. అమిత్ .. షా చేసిన ప్ర‌సంగం ఇప్పుడు ఆ పార్టీకే బూమ‌రాంగ్‌గా మారింద‌ని అంటున్నారు.

తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. తాము ఇస్తున్న నిధులు ఖ‌ర్చు చేయ‌కుండా టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ నిద్ర‌పోతున్నార‌ని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటు ప‌డింద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు షా. అదేస‌మ‌యంలో మైనార్టీల‌కు కేసీఆర్ ప్ర‌తిపాదించిన రిజ‌ర్వేష‌న్ల‌ను షా వ్య‌తిరేకించారు. త‌ద్వారా హిందూ ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని ట్రై చేశారు. అయితే, దీనికి కేసీఆర్ మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీ పాల‌కుల‌తో పెద్ద ముప్పు పొంచి ఉంద‌ని చెప్పి.. తెలంగాణ వాళ్ల‌ను ఆక‌ట్టుకున్న‌ట్టే.. ఇప్పుడు షా ను చూపించి ఉత్త‌రాది వారు కూడా తెలంగాణలో చిచ్చు పెడుతున్నారంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకునే స‌రికి.. ప్ర‌జ‌ల్లో షాపై వ్య‌తిరేక‌త వ్య‌క్తమైంది.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి ఇక్క‌డ బీజేపీ అధికార టీడీపీకి మిత్ర‌ప‌క్షం. దీంతో ఇక్క‌డ షా త‌న ప్లేటును ఫిరాయించారు. బీజేపీ ప్ర‌స్థానం ఏపీ నుంచే ప్రారంభం కావాల‌న్నారు. అయితే, ఇక్క‌డ బీజేపీ ఎంత చేస్తున్నా.. టీడీపీకే బ‌లం పెరుగుతోంద‌నేది బీజేపీ నేత‌ల వాద‌న‌. దీంతో బీజేపీ సొంతంగా ఎద‌గాలంటే.. టీడీపీని వీడాల్సిందేన‌నేది వారి ఉవాచ‌. ఇదే విష‌యాన్ని ప్ల‌కార్డుల రూపంలో షా ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలోనే ప్ర‌ద‌ర్శించారు. మ‌రి ఈ విధంగా తెలంగాణ‌లో ఒక‌లా, ఏపీలో వ్య‌వ‌హ‌రించ‌డంపై బీజేపీపై తెలుగు ప్ర‌జ‌లు ఒకింత అస‌హ‌నంగా ఉన్నారు. మ‌రి ప‌రిస్థితి ఈ ఈ విధంగా ఉంటే బీజేపీ ఎలా పుంజుకుంటుందో చూడాలి.