అమ‌రావ‌తి టాప్ 5 వెన‌క అస‌లు నిజానిజాలు

`అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి రాజ‌ధానిగా చేయ‌డ‌మే నాల‌క్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్త‌మ న‌గ‌రాల్లో నిల‌పడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. అమ‌రావ‌తిలో ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ సంస్థ‌లు, కంపెనీలు, వెడల్ప‌యిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యాన‌వ‌నాలు, అత్యాధునిక టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ‌.. ఇలా ఒక్క‌టేమిటి అన్నీఉంటాయ‌ని గాలిలో మేడ‌లు క‌ట్టేస్తున్నారు. అర‌చేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంది? రాజ‌ధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్ప‌టికీ ఎవ‌రికీ తెలీదు. స్విస్ చాలెంజ్ స‌మ‌స్య ఒక‌వైపు వేధిస్తోంది. అస‌లు భూముల లెక్క తేల‌నే లేదు. నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయో తెలీదు? మ‌రి ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య‌.. దేశంలోనే అత్యుత్త‌మ న‌గ‌రం.. అది కూడా ప‌దేళ్ల‌లో సాధ్య‌మేనా?

దేశంలో ఇప్పుడున్న గొప్ప నగరాలు.. ఈ స్థాయికి చేరుకోవ‌డానికి ఎన్నో ద‌శాబ్దాలు ప‌ట్టింద‌న్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇంకా అస‌లు నిర్మాణ‌మే ప్రారంభంకాని.. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రపంచ స్థాయి న‌గ‌రాల స్థాయికి చేరుకునేందుకు కేవ‌లం ప‌దేళ్లు స‌రిపోతుందా? అనేది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌! అస‌లు ఇంకా రాజ‌ధానిలోని భ‌వ‌నాల‌కు డిజైన్ కూడా ఖ‌రారు కాలేదు. మాకీ సంస్థ ఇచ్చిన కొన్ని డిజైన్‌లు బాగాలేద‌ని చెప్పి ఆసంస్థ‌ను త‌ప్పించింది ప్ర‌భుత్వం. ముఖ్యంగా ప్ర‌పంచ స్థాయి హంగుల‌తో రాజ‌ధాని నిర్మించాలంటే ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు అవుతాయి. మ‌రి వీట‌న్నింటికీ పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయో తెలియ‌దు.

ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయ చేస్తుంద‌ని భావించిన కేంద్రం.. ఇప్ప‌టికే చేతులెత్తేసింది. అర‌కొర నిధులు త‌ప్ప విదిల్చేది లేద‌ని స్ప‌ష్టంచేసింది, మ‌రి ఈ స‌మ‌యంలో అన్ని లక్ష‌ల కోట్లు చంద్ర‌బాబు.. ఎలా తీసుకు రాగ‌ల‌రు? ప్రపంచ బ్యాంకు రుణం కోసం పంపిన ఫైలు కూడా.. భూ సమీకరణ రైతుల ఫిర్యాదులు, పర్యావరణ సమస్యలపై సందేహాలతో వెనక్కు వచ్చేసింది. భూ సమీకరణకు ప్రతిగా ఇచ్చిన ప్లాట్ల చిక్కులు ఎప్పుడు తొలగుతాయో కూడా బోధపడటం లేదు. వేల ఎకరాల రైతుల భూమి చేతులో ఉంది గనక చిటికేస్తే అంతర్జాతీయ సంస్థలు వచ్చి వాలిపోతాయని వేసిన అంచనాలు ఫలించిందేమీ లేదు.

స్విస్‌ చాలెంజి సమస్యల మాట అటుంచి డొంక తిరుగుడుగా దాన్నే ముందుకు తెచ్చినా టెండ‌రు వేసేందుకు ముందుకు రాలేదు. ప్రభుత్వం పంచిన భూములు తప్ప ఇతర భూములకు రేట్టు ఎందుకు అనుకున్న దానికి సమీపంగానైనా పెరగలేదు? అమరావతి సంగతి అటుంచి ఆ ప్రభావంతో విజయవాడలోనూ కృష్ణాజిల్లాలోనూ ఆర్థిక కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. అలాగే గ్రీన్ ట్రైబ్యున‌ల్ నుంచి ఇంకా అమ‌రావ‌తి నిర్మాణానికి అనుమ‌తులు రాలేదు. ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పుడు మొద‌ల‌వువుతంది? ఎప్పుడు దేశంలో ఐదు ఉత్త‌మ న‌గ‌రాల జాబితాలో చోటు సంపాదిస్తుంది!!