కేసీఆర్ మాట లెక్క‌చేయంది వీళ్లే..!

తెలంగాణలో త‌నకు ఎదురు లేద‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కు ఇంటి పోరు ఎక్కువైంద‌ట‌! త‌న సొంత పార్టీలోనే ఎవ‌రూ త‌న‌ను లెక్క‌చేయడం లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా త‌న రాజ‌కీయ భిక్ష‌తో ప‌ద‌వులు అనుభ‌విస్తున్న హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌లోని కార్పొరేట‌ర్లే. త‌న‌ను లెక్క‌చేయ‌క‌పోవ‌డంపై కేసీఆర్ తీవ్రంగా మ‌థ‌న ప‌డిపోతున్నార‌ని స‌మాచారం. కార్పొరేట‌ర్లు.. ఎవ‌రికి వారే త‌మ ఇష్టానుసారం నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, గులాబీ బాస్ చెప్పిన మాట‌లు పెడ‌చెవిన పెడుతుండ‌డంపై ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున జ‌రిగిపోతున్నాయి. దీంతో కేసీఆర్ తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట‌ర్ల వైఖ‌రి ఇలానే ఉంటే.. అటు పార్టీ, ఇటు ప్ర‌భుత్వం కూడా తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న మ‌థ‌న ప‌డుతున్నారు. 

ఈ ప‌రిణామం నుంచి గ‌ట్టెక్కేందుకు కేసీఆర్ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేయాల‌ని యోచిస్తున్నార‌ని తెలుస్తొంది. హైద‌రాబాద్‌లో కార్పొరేటర్లు భూదందాలు, భవన నిర్మాణ యజమానులను బెదిరించడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రికి వారే పార్టీని అడ్డం పెట్టుకుని, త‌మ‌కు తిరుగులేద‌ని భావిస్తూ..  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో టీఆర్ ఎస్‌పై స్థానికంగా ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ చిన్న‌ప‌నిపైనైనా కార్పొరేట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. `మా కేంటి` అని వాళ్లు ఎదురు ప్ర‌శ్నిస్తూ.. చేతులు చాపేస్తున్నారు. కొన్ని చోట్ల బెదిరింపుల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు సంయ‌మ‌నం పాటించిన కేసీఆర్‌.. ఇక ప‌రిస్థితి ఇలానే ఉంటే 2019లో పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చ‌ర్య‌ల‌కు న‌డుం బిగించార‌ని, కార్పొరేట‌ర్ల‌ను గాడిలో పెట్టాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. నిజానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదీలు ప్రాంతీయ ద్వేషాల‌ను ప‌క్క‌న పెట్టి.. కేసీఆర్‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. మొత్తం 99 చోట్ల కేసీఆర్ పార్టీకి ప‌ట్ట‌క‌ట్టారు. దీంతో దేశంలోనే ఓ కార్పొరేష‌న్‌లో అతిపెద్ద పార్టీగా టీఆర్ ఎస్ అప్ప‌ట్లో చ‌రిత్ర సృష్టించింది.  టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి ఉన్న నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా కార్పొరేటర్లుగా పోటీ చేసి గెలిచారు. 

వీరంతా రాజ‌కీయాల‌కు కొత్త‌కావ‌డంతో ఎన్నికైన కొత్తల్లో వీరికి అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రజలతో సత్సంబంధాలుండాలని, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. అయితే వాటిని పట్టించుకోని కొందరు కార్పొరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. కొందరు కార్పొరేటర్లు నేరుగా వివాదాల్లో తలదూరుస్తున్నారు. మరికొందరు కార్పొరేటర్ల కుటుంబ‌ సభ్యులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. కొందరు మారణాయుధాలతో దాడులు చేయడం కూడా జ‌రుగుతోంది.

ఇటీవల ఒక కార్పొరేటర్ తన ఫోన్ నుంచి బూతు మెసేజ్ లు వాట్సప్ ద్వారా పంపడం కూడా వివాదాస్పదమైంది. ఆ కార్పొరేటర్ పై మహిళా కార్పొరేటర్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలోనే త‌న పార్టీ కార్పొరేటర్ల పై ఇంటలిజెన్స్ నివేదిక తెప్పించుకున్న కేసీఆర్ కి అనేక భ‌యంక‌ర నిజాలు తెలిసిపోయాయి. దీంతో వీరిని ఇలా వదలేస్తే కష్టమేనని భావించారు.  దీంతో వీరిని గాడిలో పెట్టేందుకు, కొర్రు కాల్చి వాత పెట్టేందుకు ముహూర్తం నిర్ణ‌యించారు. ఈ బాధ్య‌త‌ను త‌న కుమారుడు, మంత్రి కేటీఆర్‌కి అప్ప‌గించారు. దీంతో  త్వరలోనే కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే కేటీఆర్ కార్పొరేటర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేయనున్నారు.  మ‌రి వారు మార‌తారో లేదో చూడాలి.